కేరళ కొల్లాంలో పక్కా 'పాము స్కెచ్'తో భార్యను హత్య చేసిన కేసుకు సంబంధించిన దర్యాప్తును పోలీసులు మరింత ముమ్మరం చేశారు. హత్య కోసం ఉపయోగించిన పామును వెలికితీసి శవపరీక్ష నిర్వహించారు.
పోలీసులు, అటవీ అధికారుల బృందం నిందితుడి నివాసానికి చేరుకొని పాము కళేబరాన్ని పాతిపెట్టిన ప్రదేశాన్ని గుర్తించి జాగ్రత్తగా తవ్వి బయటకు తీశారు.
పాము కాటు వల్లే..
పాము కాటు వల్లే బాధితురాలు(ఉత్రా) మరణించిందనే విషయం శవపరీక్షల్లో స్పష్టమైందని అధికారులు వెల్లడించారు. దాదాపు 152 సెం.మీ.ల పొడవైన పాము ఇప్పటికే కుళ్లిపోయే స్థితికి చేరుకుందని, అయితే శవపరీక్షకు అవసరమైన నమూనాలు తీసుకోగలిగినట్లు పేర్కొన్నారు. పాము కోరలను సైతం నమూనాల కోసం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.