ఉత్తర్‌ప్రదేశ్‌లో హత్యాచార బాధితురాలి కుటుంబాన్ని కలిసేందుకు హాథ్రస్‌కు రాహుల్ గాంధీ నేతృత్వంలో ఎంపీలు వెళ్లనున్న నేపథ్యంలో వారిని అడ్డుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టింది యోగి ప్రభుత్వం. నోయిడాలోని దిల్లీ- ఉత్తర్‌ప్రదేశ్ సరిహద్దులో భారీగా పోలీసులను మోహరించారు. ఇప్పటికే అక్కడికి పోలీసు ఉన్నతాధికారులు చేరుకున్నారు. బారికేడ్లను ఏర్పాటు చేశారు. గౌతమ్ బుద్ధ నగర్లో 144 సెక్షన్‌ను కొనసాగిస్తున్నారు.
దిల్లీ- నోయిడా సరిహద్దును పూర్తిగా మూసివేయకపోయినప్పటికీ.. తనిఖీలు ముమ్మరం చేశామని స్థానిక పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
యూపీ కాంగ్రెస్ చీఫ్ గృహనిర్బంధం..
రాహుల్ గాంధీ హాథ్రస్ పర్యటన నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ కుమార్ లాలును గృహనిర్బంధం చేశారు. లఖ్‌నవూలోని ఆయన నివాసంలో భారీగా పోలీసులను మోహరించినట్లు పార్టీ అధికార ప్రతినిధి అన్షు అవాస్తి తెలిపారు. బయటకి వెళ్లేందుకు కూడా అనుమతించటం లేదన్నారు. రాహుల్ గాంధీ కార్యక్రమంలో పాల్గొనకుండా చేసిన కుట్రలో ఇది భాగమేనని ఆయన తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడితో పాటు జిల్లా అధ్యక్షులు, 500 మందికిపైగా కార్యకర్తలను నిర్బంధించినట్లు కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. న్యాయం కోసం పోరాడుతున్న వారిని యోగి ప్రభుత్వం ఆపలేదని పేర్కొంది.
రాజకీయాల కోసమే..
రాహుల్ గాంధీ హాథ్రస్ పర్యటనపై విమర్శలు గుప్పించారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. కాంగ్రెస్ వ్యూహాలు ప్రజలకు తెలుసునన్నారు. అందుకే 2019 ఎన్నికల్లో భాజపాకు చారిత్రాత్మక విజయాన్ని కట్టబెట్టారని పేర్కొన్నారు. హాథ్రస్ సందర్శన వారి రాజకీయాల కోసమే కానీ, బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని కాదని ప్రజలు అర్థం చేసుకున్నారని తెలిపారు.
ఇదీ చూడండి: హాథ్రస్లోకి మీడియాకు అనుమతి- రాజకీయ నేతలకు నో!