బిహార్ ఎన్నికల్లో జేడీయూ-భాజపా కూటమితో కలిసి పోటీ చేయడంపై లోక్ జనశక్తి పార్టీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ విషయంపై సోమవారం జరిగిన పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఓ స్పష్టత వస్తుందని భావించినప్పటికీ.. అలా జరగలేదు. కూటమితో కొనసాగాలా? వద్దా? అనే విషయాన్ని నిర్ణయించే అధికారాన్ని పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాసవాన్‌కు అప్పచెప్పాలని ఈ భేటీలో పాల్గొన్న నేతలు తీర్మానించారు.
'మాకొద్దు ఈ పొత్తు...'
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలో ఎన్నికల బరిలో దిగకూడదని.. సమావేశంలో ఎల్జేపీ నేతలు డిమాండ్ చేసినట్టు సమాచారం. జేడీయూకు వ్యతిరేకంగా అభ్యర్థులను దింపాలని తేల్చిచెప్పినట్టు తెలుస్తోంది. కరోనా సంక్షోభం నేపథ్యంలో ఎన్నికల నిర్వహిస్తున్నందుకు.. నితీశ్ కుమార్‌పై ప్రజలు అసంతృప్తితో ఉన్న విషయాన్ని వారు ప్రస్తావించినట్టు పార్టీ వర్గాల సమాచారం.
అయితే.. ఎల్జేపీ ఎవరికీ వ్యతిరేకం కాదని, ప్రజల సమస్యలను లేవనెత్తడానికి నిరంతరం శ్రమిస్తామని.. సమావేశానికి హాజరైన చిరాగ్ పాసవాన్ పేర్కొన్నట్టు తెలుస్తోంది.
ఎన్నికల అభ్యర్థుల విషయంపైనా ఈ భేటీలో చర్చ జరిగింది. 143 స్థానాలకు.. వీలైనంత త్వరగా అభ్యర్థులను ఎంపిక చేసి, ఆ జాబితాను పార్లమెంటరీ బోర్డుకు పంపించాలని నేతలు నిర్ణయించారు.