అమెరికా అధ్యక్షుడి భారత పర్యటన అంటే, చిరకాల చెలిమిని ఉమ్మడి బలిమిగా మార్చుకునే అపురూప సందర్భం. శ్వేత సౌధాధిపతిగా ఇండియాపై ప్రేమ పగ, స్నేహం ద్వేషాలను అలవోకగా పలికించే డొనాల్డ్ ట్రంప్ నేడూ రేపూ 36 గంటలపాటు జరపనున్న భారత యాత్ర ఎలాంటి ఫలితాన్నివ్వనుందన్నది మాత్రం పెద్ద ప్రశ్నార్థకం! 'భవ్యమైన భవితకు బలీయ స్నేహబంధం' అంటూ అహ్మదాబాద్‌లో 22 కిలోమీటర్ల రహదారి పొడవునా 28 రాష్ట్రాలను ప్రతిబింబించేలా అన్ని వేదికలను తీర్చిదిద్ది ట్రంప్ దంపతులకు అపూర్వ స్వాగతం పలికేలా ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. లాభం లేనిదే వ్యాపారి వరదన పోడన్న నానుడికి నిలువెత్తు రూపు అయిన ట్రంప్- ఇప్పుడు కాకపోయినా మునుముందు ఇండియాతో భారీ వాణిజ్య ఒప్పందం తథ్యమన్న ఆకాంక్షలతో, కోటిమంది జనావళి స్వాగతగీతి తథ్యమన్న ఆశల పల్లకిలో ఊరేగి వస్తున్న వేళ ఇది. ఇండియా పాక్‌ల మధ్య వివాద పరిష్కారానికి మధ్యవర్తిత్వ ప్రతిపాదనతో భారత్ నొచ్చుకొనేలా వ్యవహరించిన ట్రంప్ సర్కారు- తన గడ్డమీది ఉగ్రవాదులపై ఇస్లామాబాద్ చర్య తీసుకొంటేనే ద్వైపాక్షిక చర్చలకు మేలు బాటలు పడతాయని తాజాగా స్పష్టీకరించింది. చూడబోతే, ట్రంప్ తాజా పర్యటనకు ముందు వెలువడిన సానుకూల సందేశం అదొక్కటే! 'స్వేచ్ఛావాణిజ్యానికి మేము మద్దతిస్తాం... అయితే అది న్యాయబద్ధంగా ఉభయులకూ ప్రయోజనం కలిగించేలా ఉండాలి' అని 2018 జనవరిలో తీర్మానించిన ట్రంప్, దరిమిలా ఇండియా చైనాలతో సాగించిన వాణిజ్య పోరు ఎంత నష్టదాయకంగా పరిణమించిందీ ఇటీవలి ముచ్చటే! బీజింగుతో మాదిరిగానే తొలిదశ వాణిజ్య ఒప్పందమైనా ఇండియాతో కుదుర్చుకోవడానికి జరిగిన విఫలయత్నం- క్షేత్రస్థాయి సంక్లిష్టతలకు అద్దం పడుతోంది. పది లక్షలమంది ప్రవాసులు, 40 లక్షలమంది భారతీయుల పెన్నిధితో సుసంపన్నమైన అమెరికా- ఇండియాకు అన్ని విధాలుగా ఆత్మీయ దేశం.‘తొలుత అమెరికా’ విధానంతో వాణిజ్య లోటుపై తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లంటున్న ట్రంప్, ఇండియా సైతం స్వీయ ప్రయోజనాల్ని పణం పెట్టలేదని గుర్తించడం- నేటి అవసరం!
అపార్థాలే అడ్డుగోడలై...
భారత్, అమెరికాలు రెండూ పరస్పరం బాగా అర్థం చేసుకొన్నాయని 1949నాటి వాషింగ్టన్ పర్యటనలో తొలి ప్రధానిగా నెహ్రూ ఘనంగా చాటారు. రెండు దేశాల మధ్య వ్యవసాయం మొదలుకొని సౌరశక్తి సహా భిన్న రంగాల్లో ఉభయ తారక సహకారంపై నిర్దిష్ట ప్రతిపాదనలు మరికొద్ది నెలల్లో రూపుదాల్చనున్నాయని డెబ్భయ్యో దశకంలో శ్వేతసౌధాధిపతిగా భారత్ పర్యటించిన జిమ్మీ కార్టర్ ప్రకటించారు. ప్రపంచంలోనే ప్రాచీన, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల నడుమ ఎడతెగని అపార్థాలే అడ్డుగోడలై దశాబ్దాల తరబడి సరైన సయోధ్యే కొరవడిందని చెప్పక తప్పదు! ఆర్థిక సంస్కరణల శకంలో రొమ్ము విరుచుకొని ఎదుగుతున్న ఇండియాను అవకాశాల స్వర్గంగా చూసి, కొత్త సహస్రాబ్ది నెయ్యానికి అధ్యక్షుడిగా బిల్ క్లింటన్ పునాదులు వేశారు. ద్వైపాక్షిక బాంధవ్యం భౌగోళిక భాగస్వామ్యంగా రూపాంతరం చెందుతోందని 2005నాటి జార్జి బుష్, మన్మోహన్ సింగుల సంయుక్త ప్రకటన ఎలుగెత్తి చాటింది. దేశాధ్యక్షుడిగా రెండు పర్యాయాలు ఇండియాలో పర్యటించిన రికార్డు సొంతం చేసుకొన్న ఒబామా జమానాలోనే- ఇండో పసిఫిక్ తీరంలో భారత్ పోషించగల క్రియాశీల భూమికను ప్రస్తావిస్తూ దార్శనిక పత్రమూ వెలుగు చూసింది. శ్వేత సౌధాధిపత్యం ట్రంప్‌కు దఖలుపడ్డాక ప్రధాన రక్షణ భాగస్వామిగా ఇండియాకు ఇచ్చిన హోదాను మరింత విస్తృతం చేసి, సమాచార అనుకూలత భద్రత ఒప్పందం (కామ్‌కోసా) పట్టాలకెక్కించారు. రక్షణ ఉత్పత్తుల విక్రయాలకు అక్కరకొచ్చేలా ఇండియాను అక్కున చేర్చుకొంటున్న అగ్రరాజ్యం- ఇతర దేశాల నుంచి భారత్ ఆయుధాల కొనుగోళ్లపైనా కన్నెర్రజేస్తోంది. చైనాతో అమెరికా వాణిజ్యలోటులో పదోవంతు కూడా లేని ఇండియా పైనా కారాలూ మిరియాలూ నూరుతున్న ట్రంపరితనం- ‘ప్రియమైన శత్రువు’ను సాక్షాత్కరింపజేస్తోంది!
వాణిజ్య వివాదాల్లో ఆచితూచి అడుగేయాలి
ఒకే రకమైన విలువల్ని విశ్వసిస్తూ, ఒకే విధమైన లక్ష్యం కోసం పరిశ్రమిస్తున్న భారత అమెరికాలు పరస్పర సంబంధాల్ని మెరుగుపరచుకొని పటిష్ఠ భాగస్వాములుగా గట్టి కృషి సాగించాలన్న వ్యూహాత్మక భాగస్వామ్య ఒడంబడిక రూపొంది రెండు దశాబ్దాలైంది. 1999-2018 మధ్యకాలంలో వస్తుసేవల్లో ద్వైపాక్షిక వాణిజ్యం 1,600 కోట్ల డాలర్ల నుంచి 14,200 కోట్ల డాలర్లకు విస్తరించి, అమెరికాకు ఎనిమిదో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఇండియా ఎదిగింది. అమెరికాతో వాణిజ్యంలో దక్షిణ కొరియా, ఫ్రాన్స్‌ల సరసకు ఇండియా చేరిందన్న మాటేగాని- సుంకాలు, విదేశీ పెట్టుబడులపై నియంత్రణలు, వ్యవసాయ పౌల్ట్రీ ఉత్పాదనలపై ఆంక్షలు, మేధా సంబంధ హక్కులపై ఆందోళనలు నీడలా వెన్నాడుతూనే ఉన్నాయి. వాటికి వైద్య ఉపకరణాలు, డిజిటల్ ఆర్థికానికి సంబంధించిన సమస్యలూ తాజాగా జతపడి, వాణిజ్య లోటుపై ట్రంప్ ప్రధానంగా దృష్టి సారించడంతో వివాదాలు ముదురుపాకాన పడ్డాయి. ఇండియాతో వాణిజ్య లోటు తగ్గుతున్నా- ఆ వంకన భారత్ మెడలు వంచి వ్యవసాయ పౌల్ట్రీ రంగాల తలుపులు తెరిపించాలన్న తెరచాటు అజెండాతో భారీ సుంకాల వడ్డనలు మోతెక్కాయి. ఇండియా మరే మాత్రం అభివృద్ధి చెందుతున్న దేశం కానేకాదంటూ వాణిజ్య రాయితీలకు చెల్లుకొట్టిన ట్రంప్ ప్రభుత్వం- ‘మా ఇంటికొస్తే ఏం తెస్తావు, మీ ఇంటికొస్తే ఏం పెడతావు?’ చందంగా వ్యవహరిస్తోంది. భారత నౌకాదళానికి 260 కోట్ల డాలర్లతో 24 సీహాక్ హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందం ఖరారు కానుందంటున్నా- ఇదమిత్థంగా ఎన్ని ఒడంబడికలు కుదరనున్నాయో చూడాలి. వాణిజ్య వివాదాల జడిలో ఇండియా ఆచితూచి అడుగెయ్యాలి!