లోక్‌సభలో ముమ్మారు తలాక్ బిల్లుపై సుదీర్ఘ చర్చ నడుస్తోంది. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ఎలాగైనా ఈ బిల్లును ఆమోదించుకోవాలని చూస్తోంది కేంద్రం. అవసరమైతే సమావేశాలను పొడిగించే యోచనలోనూ ఉంది.
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకే.. ముమ్మారు తలాక్ బిల్లును ప్రభుత్వం తీసుకొచ్చినట్లు స్పష్టం చేశారు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్.2017 జనవరి తర్వాత తలాక్‌పై దేశవ్యాప్తంగా 574 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. అదే ఏడాది ఆగస్టులో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత.. 345 కేసులు నమోదైనట్లు మీడియో నివేదికలు వెల్లడించాయని సభకు తెలిపారు రవిశంకర్. లింగ సమానత్వం, సామాజిక న్యాయం భారత రాజ్యాంగం మూల సూత్రాలని బిల్లు ఆవశ్యకతను సభకు వివరించారు రవిశంకర్.
ముస్లిం మహిళల బిల్లు 2019 ప్రకారం తక్షణ ముమ్మారు తలాక్ చట్టవిరుద్ధం. ఈ చట్టం భర్తకు మూడేళ్ల శిక్ష విధించాలని స్పష్టం చేస్తుంది.
లోక్‌సభలో మాట్లాడుతున్న రవిశంకర్ ప్రసాద్ ''2017 జనవరి నుంచి 574 తలాక్ కేసులు నమోదైనట్లు మీడియా నివేదికలు వెల్లడించాయి. 2017 ఆగస్టులో సుప్రీంకోర్టు తీర్పు తర్వాతే 345 కేసులు నమోదయ్యాయి. ప్రపంచంలోని 20 దేశాలు ముమ్మారు తలాక్‌ని నిషేధించాయి. లౌకికరాజ్యమైన భారత్ ఎందుకు ఆ పని చేయకూడదు. తప్పకుండా చేయాలి. సుప్రీంకోర్టు కూడా ముమ్మారు తలాక్‌ను తప్పు పట్టింది. ప్రధాన న్యాయమూర్తి.. చట్టం చేయాలని చెప్పారు. బాధిత మహిళలు సుప్రీంకోర్టు తీర్పును ఇంట్లో పెట్టుకోవాలా..? లింగ సమానత్వం, మహిళలకు న్యాయం భారత రాజ్యాంగంలోని మూల సిద్ధాంతమని అంతా అర్థం చేసుకోవాలి.''
- రవిశంకర్ ప్రసాద్, కేంద్ర న్యాయశాఖ మంత్రి