సామూహిక ట్రాన్స్జెండర్ల వివాహం ఎనిమిదేళ్ల క్రితం మహారాష్ట్ర నాగ్‌పూర్‌లోని గులాం నబీ అన్సారీతో ప్రేమలో పడింది ట్రాన్స్‌జెండర్ సలోని. వారి కుటుంబాలు మాత్రం పెళ్లికి నిరాకరించాయి. వారి బంధాన్ని చూసి ఇతరులు అపహాస్యం చేశారు. అయినా ఆ జంట ఒకరినొకరు వీడలేదు. సలోని-అన్సారీ జంట తాజాగా మూడు ముళ్ల బంధంతో ఒక్కటైంది. ఛత్తీస్‌గఢ్ రాయ్‌పూర్‌లో ట్రాన్స్జెండర్ల సామూహిక వివాహాలు ఆదివారం జరిగాయి. ఇందులో 15 జంటలు సామాజిక హద్దులను చెరిపేసి ఒక్కటై తమకూ సాధారణంగా జీవించే హక్కు ఉందని చాటి చెప్పారు.
2014లో ట్రాన్స్జెండర్లను మూడో లింగమని గుర్తింపునిస్తూ సుప్రీం తీర్పునిచ్చింది. వారికి అన్ని హక్కులు ఉండాలని తేల్చిచెప్పింది. సుప్రీం తీర్పును పూర్తిస్థాయిలో ఆచరణలోకి తెచ్చేందుకు ట్రాన్స్జెండర్ల సామాజిక కార్యకర్త విద్యా రాజ్‌పుత్ నడుం బిగించారు.
తన ప్రయత్నంలో భాగంగా ట్రాన్స్జెండర్లకు పెళ్లిళ్లు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు విద్యా రాజ్‌పుత్. ఈ కార్యక్రమానికి 15 జంటలు ముందుకొచ్చాయి. ఇందులో ఆరు రాష్ట్రాలకు చెందిన ట్రాన్స్జెండర్లు ఉన్నారు. విద్య కృషి ఫలితంగానే రాయ్‌పూర్ పుజారి పార్క్ ప్యాలెస్‌లో అన్సారీ-సలోనిల కల నిజమైంది.
ఇదీ చూడండి:విదేశాలకు ఆదివాసీల 'విప్పపువ్వు సారా'