తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చిలుకకు సమాధి.. ఇది ఎప్పుడైనా విన్నారా?

మహారుషుల మందిరాలు చూసుంటారు. రాజులు, చక్రవర్తుల సమాధులు సందర్శించి ఉంటారు. కానీ ఓ చిలుకకు కట్టిన సమాధి గురించి ఎప్పుడైనా విన్నారా? అవును... చిలుక సమాధి గురించే మాట్లాడుతున్నాం. అదెక్కడుందో మీకు తెలుసా..? అక్కడికే వెళ్లి చూసొద్దాం రండి.

Tomb of the parrot .. Have you ever heard of it?
చిలుకకు సమాధి.. ఇది ఎప్పుడైనా విన్నారా?

By

Published : Sep 26, 2020, 3:54 PM IST

చిలుక కోసం సమాధి

ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌లో ఉన్న చిలుక సమాధి.. తకియా షరీఫ్‌పేరుతో ప్రసిద్ధి. హజ్రత్ బాబా మురాద్‌షా, ఆయన సోదరుడు బాబా మొహబ్బత్‌షా సమాధుల పక్కనే, వాళ్లు పెంచుకున్న చిలుకకూ సమాధి నిర్మించారు. ఈ ఇద్దరు అన్నదమ్ములు కాబూల్ నుంచి సర్‌గుజాకు వచ్చారు. ఇక్కడి ఆదివాసీల్లో ఉన్న నరబలి దురాచారాన్ని రూపుమాపేందుకు కృషిచేశారు. అప్పటినుంచి వారిని అల్లాకు ప్రతిరూపాలుగా భావించేవారు స్థానికులు. ముస్లింలు పీర్‌రూపంలో వీరిని పూజిస్తారు. తకియా షరీఫ్‌కు వచ్చే భక్తులు.. మొహబ్బత్‌షా, మురాద్‌షాతో సమానంగా చిలుకకు పూజలు చేస్తారు. 3 సమాధులపైనా ఛాదర్‌లు కప్పుతారు.

''భారతదేశంలోనే చిలుకకు ఉన్న ఏకైక సమాధి ఇది. బాబాతో కలిసి, ఓ పంజరంలో ఈ చిలుక నివసించేది. బాబా మరణించిన తర్వాత, చిలుక కూడా చనిపోయింది.''

- అబ్దుల్ రషీద్ సిద్ధిఖీ, సీనియర్ న్యాయవాది

అన్ని సామాజికవర్గాలకు చెందిన భక్తులు బాబాకు పూజలు చేసేందుకు ఇక్కడికి వస్తారు. ఏటా ఉర్స్ ఉత్సవం జరుగుతుంది. కుల, మత, వర్గాలకు అతీతంగా పెద్దసంఖ్యలో ప్రజలు ఈ పండుగలో పాల్గొంటారు. ఇక్కడ రికార్డులు రాసే సీనియర్ అడ్వకేట్ అబ్దుల్ రషీద్... ఇది ఛత్తీస్‌గఢ్‌లోనే అత్యంత పురాతన దర్గా అని చెబుతున్నారు.

బూడిద కుప్పపై చెక్కుచెదరని పునాది...

1951లో అసలైన సమాధి ఉన్న గుడిసెను తొలగించి, కాంక్రీటు భవనం కట్టేందుకు తవ్వుతుంటే.. బూడిద పుట్టుకొచ్చిందట. కొన్ని అడుగుల మేర తవ్వినప్పటికీ... బూడిద వస్తూనే ఉండడంతో, దానిపైనే పునాది నిర్మించాలని నిర్ణయించారు. ఇన్నేళ్లయినా బూడిద కుప్పపై కట్టిన పునాది చెక్కుచెదరక పోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అక్కడి భూమిలో దొరికిన అవశేషాలు పరిశోధిస్తే... ఈ బాబా మదారీ తెగకు చెందినవాడుగా తేలింది.

''తవ్వకాలు జరిగేటప్పుడు.. 5 అడుగుల లోతుకు వెళ్లినా, బూడిద మాత్రమే కనబడింది. అయినా సరే దానిపైనే దర్గా నిర్మించాలని నిర్ణయించారు.''

- అబ్దుల్​ రషీద్​ సిద్ధిఖీ, సీనియర్​ న్యాయవాది

అంజుమన్ కమిటీ ఇక్కడ ఏటా ఉర్స్ ఉత్సవాలు నిర్వహిస్తుంది. ఇప్పటివరకు 535 సార్లు ఉర్స్ జరిగింది. దీన్ని బట్టి, మురాద్‌షా, మొహబ్బత్‌షాల దర్గా 535 ఏళ్ల నాటిదని నమ్ముతారు. కానీ దర్గాలోని రాతిఫలకంపై...1951లో దర్గా నిర్మాణం జరిగినట్లు రాసి ఉంది. రాతపూర్వక ఆధారాలు లేనందున ఈ వివరాలు అంత స్పష్టంగా తెలియవు. బాబా మురాద్‌షా, మొహబ్బత్‌షా దర్గా 600 ఏళ్ల క్రితం నాటిదని చెబుతారు. ఈ దర్గాను ఆనుకునే నక్కటీ దేవి మందిరం ఉంటుంది. కోర్వా తెగకు ఈ ఒక్క ఆలయమే ఉందని అబ్దుల్ రషీద్ చెబుతున్నారు. ఈ గుడిలోనూ హిందువులు, ముస్లింలూ పూజలు చేస్తారు.

''కోర్వా జాతికి చెందిన మొదటి గుడి ఇది. భారతదేశం మొత్తంలో కోర్వా జాతికి మరో గుడి లేదు. ఇది మొట్టమొదటి కోర్వా మందిరం. ఈ గుడిలో పూజారిగా కోర్వా జాతికి చెందినవారే ఉంటారు. మొఘలుల కాలంలో ఈ మందిర నిర్మాణానికి, దర్గా నిర్మాణానికి స్థలం కేటాయించారు.''

- అబ్దుల్ రషీద్ సిద్ధిఖీ, సీనియర్ న్యాయవాది

మురాద్‌షా దర్గాకు వచ్చే భక్తులు ఖాళీ చేతులతో తిరిగి వెళ్లరని చెబుతారు. సర్‌గుజా జిల్లా నుంచే కాక, బిహార్, ఝార్ఖండ్ నుంచి సైతం, హిందూముస్లింలు కోరికలు నెరవేర్చమంటూ వేడుకోవడానికి తకియా షరీఫ్‌కు వస్తారు. చాలామంది తమ కోర్కెలు నెరవేరినట్లు చెబుతారు.

''మురాద్‌షా దర్గాకు వచ్చిన వాళ్లెవరూ ఒట్టి చేతులతో తిరిగి వెళ్లరని చెబుతారు. ఆయన పేరు వలీ మురాద్‌షా బాబా.''

- భగీరథి, భక్తుడు

ఈ దర్గపై ఒక కథ కూడా ఉంది. 600 ఏళ్ల క్రితం సర్​గుజా రాజు రాజా రఘునాథ్ శరణ్‌సింగ్‌దేవ్‌కు సంతానం కలగలేదు. వంశాంకురుడైన కుమారుడు జన్మిస్తే, దర్గా చుట్టూ ప్రహారీ నిర్మిస్తానని తకియా షరీఫ్‌కు వెళ్లి వేడుకుంటాడు. కొంతకాలం తర్వాత పుత్రుడు జన్మిస్తాడట. అప్పుడు దర్గా చుట్టూ రాజు నిర్మించిన ప్రహారీ గోడ ఆనవాళ్లు ఇప్పటికీ కనిపిస్తాయి. ఇక్కడికి వచ్చి పూజలు చేసే అన్నివర్గాల ప్రజలను ఏకతాటిపైకి తెచ్చేందుకు తకియా షరీఫ్ ఓ వారధిలా పనిచేస్తోంది.

ABOUT THE AUTHOR

...view details