తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వర్షాలు: ఉత్తర భారతం విలవిల- 148 మంది మృతి - వరుణుడు

ఉత్తర భారతంపై వరుణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. భారీ వర్షాల వల్ల ఉత్తర్​ప్రదేశ్​, బిహార్​ సహా ఇతర రాష్ట్రాల్లో 5 రోజుల్లో మొత్తం 148 మంది మరణించారు. జనజీవనం స్తంభించింది. ఎన్​డీఆర్​ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు ముమ్మరం చేశాయి.​ ఉత్తర్​ప్రదేశ్​లో అత్యధికంగా 111 మంది ప్రాణాలు కోల్పోయారు.

వర్షాలు: ఉత్తర భారతం విలవిల- 148 మంది మృతి

By

Published : Oct 1, 2019, 6:36 AM IST

Updated : Oct 2, 2019, 5:02 PM IST

వర్షాలు: ఉత్తర భారతం విలవిల

కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న భారీ వర్షాలకు బిహార్, ఉత్తర్​ప్రదేశ్ సహా ఉత్తరాది రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. జనజీవనం స్తంభించిపోయింది. గత ఐదు రోజుల్లోనే.. యూపీ, బిహార్‌ సహా మిగతా రాష్ట్రాల్లో మొత్తం 148 మంది మృతి చెందారు.

ఉత్తర్​ప్రదేశ్​లో అత్యధికంగా 111 మంది ప్రాణాలు కోల్పోయారు. బిహార్​ రాష్ట్రంలో 28 మృతి చెందారు.

బిహార్​ విలవిల...

భారీ వర్షాలతో బిహార్ వణికిపోతోంది. వర్షాల కారణంగా మరణించినవారి సంఖ్య 28కి చేరింది. గురువారం నుంచి కురుస్తోన్న వర్షాలకు రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. పడవల్లోనే ప్రయాణం సాగించాల్సిన పరిస్థితి నెలకొంది. పట్నాలోని రాజేంద్ర నగర్‌లో సుమారు 5 అడుగుల మేర వరద నీరు నిలిచిపోయింది. నగరంలోని గాంధీ మైదానం, దాని పరిసర ప్రాంతాలు.. పూర్తిగా వరద నీటితో నిండిపోయాయి. ఆసుపత్రుల్లోకి నీరు చేరడం వల్ల వైద్య సేవలు అందించడం కష్టమవుతోంది. అనేక చోట్ల సబ్‌స్టేషన్లు నీట మునిగి విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

పట్నా, భగల్‌పూర్, కైమూర్‌ జిల్లాలో గత 48 గంటల్లో భారీ వర్షపాతం నమోదైంది. వచ్చే 24గంటల్లో భారీవర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికలతో.. ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ప్రభుత్వం మంగళవారం వరకూ పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆహార పొట్లాలు, మందుల సరఫరాకు వైమానిక దళం సాయాన్ని కోరింది. రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలతో పాటుగా 19 ఎన్​డీఆర్​ఎఫ్​ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.

ఉత్తర్​ప్రదేశ్ చిన్నాభిన్నం...

ఉత్తర్​ప్రదేశ్​లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. వర్షాల కారణంగా... గత ఐదు రోజుల్లో ఇప్పటివరకు 111 మంది మృతి చెందారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. విపత్తు స్పందన బృందాలు రంగంలోకి దిగి ముంపునకు గురైన ప్రాంతాల్లోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. బాలియా జిల్లా కారాగారం బ్యారక్‌లలోకి వరదనీరు ప్రవేశించడం వల్ల 900 మంది ఖైదీలను మిగతా జైళ్లకు తరలించారు.

రవాణా వ్యవస్థ దెబ్బతింది. వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. 20 రైలు సర్వీసులను రద్దు చేశారు. మరో 20 సర్వీసులను దారి మళ్లించారు.

ఝార్ఘండ్​ రాష్ట్రంలోని దుమ్కా జిల్లాలో గోడ కూలిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఉత్తరాఖండ్​, మధ్యప్రదేశ్​, రాజస్థాన్​ రాష్ట్రాల్లో 13 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు.

కేంద్ర అండగా ఉంటుంది: ప్రధాని

భారీ వర్షాలతో బిహార్​లో జనజీవనం అస్తవ్యస్తమైంది. తాజా వరద పరిస్థితులపై రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​తో చర్చించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అన్ని రకాల సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు ప్రధాని. కేంద్ర విపత్తు స్పందన దళాలు రాష్ట్రాల విభాగాలతో కలిసి పనిచేస్తున్నట్లు ట్వీట్​ చేశారు.

మోదీ ట్వీట్​

ఇదీ చూడండి: 'కర్తార్​పుర్'​ ప్రారంభోత్సవానికి మన్మోహన్​కు ఆహ్వానం!

Last Updated : Oct 2, 2019, 5:02 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details