శాస్త్ర సాంకేతిక రంగాల్లో తిరుగులేని స్థాయికి చేరుకున్నామని, ఎల్లెడలా సృజన పతాక ఎగురవేయగలిగామని; ఆర్థిక పురోగతి, మౌలిక సౌకర్యాల విస్తరణలో కళ్లు చెదిరే విజయాలు సొంతం చేసుకున్నామని భావించిన ప్రభుత్వాలకు ఇది అనూహ్య శరాఘాతం. ఎన్ని అడుగులు ముందుకు వేసినా కంటికి కనిపించని ఓ వైరస్ ముందు మాత్రం మనిషి తాత్కాలికంగానైనా తలవంచక తప్పడం లేదు. వైరస్‌లు విరుచుకుపడి మానవాళి ఆరోగ్యాన్ని ఛిన్నాభిన్నం చేస్తే ఎలా ఎదుర్కోవాలో తెలియని సన్నద్ధత లేమిని ఈ పరిణామం బట్టబయలు చేసింది. దాంతో వ్యాధులు ప్రబలితే ఎదుర్కోలేని పాశ్చాత్య దేశాల డొల్లతనమూ వెల్లడైంది. కరోనా కట్టడికి ప్రపంచ దేశాలన్నీ ఇంచుమించుగా మూడు రకాల వ్యూహాలు అనుసరిస్తున్నాయి. 1) భౌగోళికంగా కొన్ని ప్రాంతాలను పూర్తిగా స్తంభింపజేసి మనిషి సంచారాన్ని కట్టడి చేయడం. 2) కరోనా పాజిటివ్ వ్యక్తులను లేదా అనుమానిత లక్షణాలున్నవారిని సంపూర్ణంగా ‘క్వారంటైన్’ చేయడం. 3) కరోనా తీవ్రత అధికంగా ఉన్నవారిని ప్రత్యేకంగా ఎంపిక చేసిన వైద్యశాలల్లో చేర్చ అత్యవసర చికిత్స అందించడం.
ఇప్పటివరకూ కొవిడ్-19ని ఎదుర్కొనే మందు లేదు. వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి మరికొంతకాలం పట్టవచ్చు. అప్పటివరకూ సామాజిక దూరాన్ని అనుసరిస్తూ, వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ క్రమశిక్షణతో మెలగడం ద్వారానే వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాల్సి ఉంటుంది. ఔషధాలు దరిదాపుల్లో లేని తరుణంలో సామాజిక చైతన్యంతోనే వైరస్ విస్తృతిని కట్టడి చేయాలి. కరోనా బాధితుల సంఖ్య పదుల లక్షలకు చేరడంతో ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ వైద్యశాలలన్నీ కిటకిటలాడుతున్నాయి. అంతర్జాతీయ సమాజాన్ని ఆరోగ్య సంక్షోభం చుట్టుముట్టింది. ఈ సమస్య కనుమరుగు కావాలంటే ఇంకొంతకాలం ఓపిక పట్టక తప్పకపోవచ్చు. ‘లాక్‌డౌన్’ను భారత్‌లో పకడ్బందీగా అమలు చేస్తుండటం ఆహ్వానించదగిన పరిణామం. సభలూ, సమావేశాలకు చాపచుట్టేశారు. అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఐటీ సహా వివిధ రంగాలకు సంబంధించిన ఉద్యోగులు పూర్తిగా ఇళ్లనుంచే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రజారవాణా సంపూర్ణంగా స్తంభించిపోయింది. విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఒకరినుంచి మరొకరికి కరోనా వ్యాప్తి చెందకుండా వైరస్ గొలుసును తెగ్గొట్టడంకోసం తీసుకున్న చర్యలివి. క్రితం నెల 22న విధించిన జనతా కర్ఫ్యూ, అనంతరం మూడు వారాలపాటు నిర్దేశించిన ‘లాక్‌డౌన్’ ఆశావహ ఫలితాలను సాకారం చేస్తాయనడంలో సందేహం లేదు.