తెలంగాణ

telangana

రిక్షా బాలుడు: తల్లిదండ్రుల భారాన్ని.. వందల కి.మీ మోస్తూ..

By

Published : May 15, 2020, 8:50 PM IST

Updated : May 15, 2020, 11:00 PM IST

బిహార్​కు చెందిన ఓ బాలుడు సాహసమే చేశాడు. లాక్​డౌన్ కారణంగా రవాణా సౌకర్యం లేకపోవడం వల్ల వందల కిలోమీటర్లు రిక్షాపైనే ప్రయాణించాడు. తన తండ్రిని ట్రాలీపై ఎక్కించుకొని వారణాసి నుంచి బిహార్​లోని అరారియాకు చేరుకున్నాడు.

11 years old boy riksha
తవారే ఆలం

తన భుజాలనే పల్లకిగా మార్చి అంధులైన తల్లితండ్రులను కావడిలో మోసుకెళ్లిన ఉత్తమ పుత్రుడు శ్రవణ కుమారుడి పురాణ గాధ తెలిసిందే. అయితే కలియుగంలోనూ ఓ శ్రవణ కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. 'పురాణ శ్రవణుడు' కావడిలో తల్లితండ్రులను మోస్తే.. ఈ కలియుగ శ్రవణుడు మాత్రం రిక్షాపై తల్లితండ్రులను మోస్తూ రాష్ట్రాలు దాటించాడు.

ఇదీ సంగతి!

కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా లాక్​డౌన్ విధించడం వల్ల ప్రయాణాలన్నీ ఆగిపోయాయి. ప్రజలందరూ ఎక్కడికక్కడే చిక్కుకుపోయారు. కొందరు వలస కార్మికులైతే కాలినడకనే స్వస్థలాల బాట పట్టారు.

అయితే.. బిహార్​లోని అరారియా జిల్లాకు చెందిన 11 ఏళ్ల బాలుడు తవారే ఆలం తన తండ్రిని రిక్షా ట్రాలీపై కూర్చోబెట్టి స్వగ్రామానికి తీసుకొచ్చాడు. ఉత్తర్​ప్రదేశ్​ వారణాసిలో నివసించే వీరు.. వందల కిలోమీటర్లు రిక్షాపైనే ప్రయాణించారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

పదకొండేళ్ల బాలుడి 'శ్రవణ కుమార కథ'!

తండ్రికి సహాయంగా

కుటుంబం మొత్తాన్ని తన తండ్రి రిక్షా తొక్కే పోషిస్తాడని ఆలం చెప్పుకొచ్చాడు. తండ్రి వయసు ఐదు పదులు దాటడం వల్ల సత్తువ తగ్గిపోయిందని.. అందువల్ల మధ్యమధ్యలో సహాయంగా తనే రిక్షా నడిపినట్లు ఆలం చెప్పాడు. వారణాసి నుంచి అరారియాకు ప్రయాణం పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపాడు.

బిహార్, ఉత్తర్​ప్రదేశ్​ సరిహద్దు వద్ద ఈ వీడియో తీసినట్లు తెలుస్తోంది. ఈ కలియుగ 'శ్రవణ కుమారుడి' సంకల్పానికి పలువురు నెటిజన్లు ప్రశంసలు కురుపిస్తున్నారు. మరోవైపు వలస కూలీల వ్యథలకు సంబంధించి రోజుకో వీడియో బయటకు రావడం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు.

Last Updated : May 15, 2020, 11:00 PM IST

ABOUT THE AUTHOR

...view details