రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో హైకోర్టు ధర్మాసనాల(బెంచ్‌ల) ఏర్పాటు కోసం అక్కడి ప్రభుత్వాలు పంపే ప్రతిపాదనలకు సంబంధిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, గవర్నర్ అనుమతి తప్పనిసరి అని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. దేశంలో ఉత్తర్‌ప్రదేశ్‌తో పాటు మరెక్కడైనా హైకోర్టు ధర్మాసనాలు నెలకొల్పే ఉద్దేశం ఉందా అని యూపీ ఎంపీ రాజేంద్ర అగర్వాల్ సోమవారం లోక్‌సభలో అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు మంత్రి ఈ సమాధానమిచ్చారు.
"జశ్వంత్ సింగ్ కమిషన్ చేసిన సిఫార్సులు, రిట్‌పిటిషన్(సివిల్) నెం.379/2000లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం.. ధర్మాసనాల ఏర్పాటుకు అవసరమైన మౌలికవసతుల కల్పన, వ్యయం గురించిన సమాచారంతో రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిస్థాయి ప్రతిపాదనలు పంపించాల్సి ఉంటుంది. హైకోర్టుతో పాటు, బెంచ్ రోజువారీ పరిపాలనా వ్యవహారాలు చూడాల్సింది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తే కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనతో పాటు ఆయన ఆమోదం కూడా అవసరం. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు సంబంధిత రాష్ట్ర గవర్నర్ అనుమతి కూడా ఉండాలి"