కరోనా వైరస్ కారణంగా ప్రపంచం మొత్తం సమస్యలను ఎదుర్కొంటోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎవరూ ఊహించలేదన్నారు. కొవిడ్‌కు వ్యాక్సిన్ వచ్చేంత వరకు మాస్కులు ధరించడం, 2 గజాల భౌతిక దూరాన్ని పాటించడం తప్ప మరో మార్గం లేదని స్పష్టం చేశారు. 'ఆత్మనిర్భర్ ఉత్తర్‌ప్రదేశ్ రోజ్‌గార్ అభియాన్' ప్రారంభం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు మోదీ. కరోనా మహమ్మారి వల్ల ప్రపంచంలోని అన్ని దేశాలు ప్రభావితమయ్యాయని, దాని నుంచి ఎప్పుడు విముక్తి లభిస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొందన్నారు.
"వ్యాక్సిన్ వచ్చేంత వరకు రోగనిరోధక శక్తి పెంచుకోవడం, సబ్బునీటితో చేతుల్ని శుభ్రంగా కడుక్కోవడం, ఇంటి నుంచి బయటకు వెళ్తే మాస్క్‌లు ధరించడం, రెండు గజాల భౌతిక దూరం పాటిస్తూనే ఉండాలి."
-నరేంద్ర మోదీ, ప్రధాని.
యూపీ భేష్...
కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు యూపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు మోదీ. యూపీ జనాభా.. ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ జనాభాను పోలుస్తూ ఆ దేశాల్లో 1,30,000 కరోనా మరణాలు సంభవించాయని తెలిపారు.
"ఈ దేశాలు ఒకప్పుడు ప్రపంచాన్ని జయించాయి. పైగా అత్యంత శక్తిమంతమైనవి. ఈ నాలుగు దేశాల జనాభా మొత్తం 24కోట్లు. కానీ భారత్‌లో ఒక్క యూపీ జనాభానే 24 కోట్లు. కరోనా వైరస్‌ను ఆ నాలుగు దేశాల కన్నా యూపీయే సమర్థంగా కట్టడి చేసింది. వైరస్ వల్ల అక్కడ 1,30,000 మంది మరణించగా ఇక్కడ 600 మరణాలు నమోదయ్యాయి. ఏదేమైనప్పటికీ మరణం మరణమే. ప్రతి ఒక్కరి జీవితమూ విలువైందే. అది భారత్‌లోనైనా ప్రపంచంలో మరెక్కడైనా."
-నరేంద్ర మోదీ, ప్రధాని.
యూపీలో కార్మికులకు ఉపాధి కల్పించేందుకు 'ఆత్మనిర్భర్ ఉత్తర్‌ప్రదేశ్ రోజ్‌గార్ అభియాన్' కార్యక్రమాన్ని ప్రారంభించింది యోగి ఆదిత్యనాథ్ సర్కార్. దీని ద్వారా ఆ రాష్ట్రంలోని 1.25 కోట్ల మందికి ప్రయోజనం చేకూరుతుందని అంచనా. ఇలాంటి కార్యక్రమాలను దేశంలోని అన్ని రాష్ట్రాలు చేపట్టాలని మోదీ సూచించారు. కరోనా కష్టకాలంలో యోగి పనీతీరును కొనియాడారు.
ఇదీ చూడండి: 'ఇందిరా గాంధీ మనవరాలిని.. భాజపా ప్రతినిధిని కాదు'