తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తోందన్న కారణంతో టిక్‌టాక్ ఆప్‌పై చర్యలు తీసుకోవాలని తమిళనాడు ప్రభుత్వానికి సూచించింది మద్రాస్ హైకోర్టు. యువతలో విశేష ప్రాచుర్యం పొందిన ఈ యాప్‌ను చైనా కంపెనీ బైట్‌డాన్స్ నిర్వహిస్తోంది. ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకునేందుకు వీలులేకుండా చూడాలని కోరింది. ఈ యాప్ అశ్లీలతను ప్రోత్సహిస్తూ యువతపై తీవ్ర ప్రభావం చూపుతోందని వ్యాఖ్యానించింది.
మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్‌లో దాఖలైన ఓ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం యాప్‌ను డౌన్లోడ్ చేయకుండా నిషేధించేందుకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
టిక్‌టాక్‌పై నిషేధం విధించాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున లేఖ రాయనున్నట్లు తమిళనాడు సమాచార సాంకేతిక శాఖ మంత్రి ఎం. మణికందన్ వెల్లడించారు.
లోబడతాం...
స్థానిక చట్టాలకు లోబడి ఉంటామని ఓ ప్రకటనలో తెలిపింది టిక్‌టాక్.
"భారత సమాచార సాంకేతిక చట్టం 2011 నిబంధనలకు లోబడి ఉంటాం. మేం మద్రాస్ హైకోర్టు అధికారిక ఉత్తర్వుల కోసం ఎదురుచూస్తున్నాం. ఆదేశాలు అందిన అనంతరం ఏంచేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటాం. భారత చట్టాలకు సంబంధించి ఓ నోడల్ అధికారిని నియమించాం"
-టిక్‌టాక్
భారత్‌లో అధికం...
టిక్‌టాక్‌కు ప్రపంచ వ్యాప్తంగా వందకోట్ల వినియోగదారులున్నారు. భారత్‌లో 5కోట్ల మంది ఈ యాప్‌ను వినియోగిస్తున్నారు. జనవరిలో టిక్‌టాక్‌ను డౌన్లోడ్ చేసినవారిలో 43 శాతం భారతీయులే. ఈ యాప్‌ను ఇప్పటివరకు డౌన్లోడ్ చేసుకున్న వారిలో 25శాతం భారత్‌కు చెందినవారు. ఈ సంఖ్య 25 కోట్లు ఉంటుందని అంచనా.
స్వదేశీ జాగరణ్‌మంచ్ ఫిర్యాదు...
స్వదేశీ జాగరణ్ మంచ్ కో కన్వీనర్ అశ్వనీ మహాజన్ ఫిబ్రవరిలో ప్రధానికి లేఖ రాశారు. చిన్న పిల్లల వివరాలు యాప్‌లో ఉంచుతోందని, ఇది ప్రమాదకర అంశమని లేఖలో ఉంటంకించారు.