ఇద్దరు తలారులను సమకూర్చాలని దిల్లీ తిహార్ జైలు అధికారులు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు. ఈనెల 9న ఈ మేరకు ఫ్యాక్స్ ద్వారా సందేశం పంపారు. నిర్భయ దోషులకు త్వరలో ఉరిశిక్ష అమలు చేయనున్నారని జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తిహార్ జైలు అధికారుల అభ్యర్థన ప్రాధాన్యం సంతరించుకుంది.
తమ వద్ద ఇద్దరు తలారులు ఉన్నారని, తిహార్ జైలు అధికారులు కోరినప్పుడు పంపేందుకు సిద్ధమని యూపీ అదనపు డీజీపీ ఆనంద్‌కుమార్ తెలిపారు. ఉరితీయాల్సిన వారి వివరాలు వెల్లడించనప్పటికీ తమ జైల్లో ఉరిశిక్ష పడిన దోషులు ఉన్నారని, వారికి న్యాయపరంగా ఉన్న మార్గాలన్నీ మూసుకుపోయినట్లు తిహార్ జైలు అధికారులు తమ ఫ్యాక్స్ సందేశంలో పేర్కొన్నట్లు సమాచారం.