భారత్ గత ఐదేళ్ల కాలంలో మూడు సార్లు దాయాది పాకిస్థాన్‌పై దాడులు జరిపిందన్నారు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్. భారత్ ఇక ఏమాత్రం బలహీన దేశం కాదని ఉద్ఘాటించారు రాజ్‌నాథ్. విభేదాలన్నింటిని పక్కనపెట్టి దేశం కోసం నిలబడాల్సిన పరిస్థితులు ప్రస్తుతం దేశంలో నెలకొన్నాయన్నారు. వైమానిక దాడులు సైనిక చర్య కాదని అక్కడ సాధారణ పౌరులకు నష్టం జరగలేదని స్పష్టం చేశారు. భారత్‌లో మరిన్ని దాడులకు కుట్ర చేస్తున్నందునే ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేపట్టాల్సి వచ్చిందన్నారు.
పుల్వామా ఘటన అనంతరం చేపట్టిన వైమానిక దాడులతో దీటైన సమాధానమిచ్చాం అని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. ఉగ్రవాదానికి వంత పాడటం కొనసాగిస్తే పాక్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. భారత్ ఎవరిపైనా విద్వేషాలు రెచ్చగొట్టదని, ఎవరైనా అలాంటి చర్యలకు పాల్పడితే ఉపేక్షించదన్నారు.
"గత ఐదేళ్లలో మూడుసార్లు పాకిస్థాన్‌లోకి చొచ్చుకెళ్లి మెరపుదాడులు నిర్వహించాం. రెండు నేను చెప్పగలను. కానీ మరొకటి చెప్పలేను. పాకిస్థాన్ నుంచి ఉగ్రవాదులు చొరబడి మన సైనికులపై దాడి చేశారు. బదులుగా ఉరీ ఘటనతో మనం సమాధానమిచ్చాం. పాకిస్థాన్ భూభాగంలోకి ప్రవేశించాం. మీకందరికి తెలుసు. రెండోది పాక్ గగనతలంలోకి ప్రవేశించి వైమానిక దాడి చేశాం. మూడవ దాడి వివరాలు నేను చెప్పలేను." -రాజ్‌నాథ్‌సింగ్, కేంద్ర హోంమంత్రి