అయోధ్యలో రామమందిర భూమిపూజ కార్యక్రమం దేశం మొత్తానికి, హిందువులందరికీ సంబంధించినదంటూ తన అధికారిక పత్రిక సామ్నాలో వ్యాసం ప్రచురించింది శివసేన. కానీ వ్యక్తులు, రాజకీయ పార్టీల కేంద్రీకృతంగా కార్యక్రమం జరగుతోందని విమర్శించింది. కరసేవకుల త్యాగాలతోనే రామాలయం కల సాకారమైందని తెలిపింది. వారి త్యాగాలను విస్మరించిన వారు రామ ద్రోహులు అవుతారని ఘాటు వ్యాఖ్యలు చేసింది.
"రామమందిరం నిర్మించే నేలలో కరసేవకుల త్యాగాలు ఇంకా పరిమళిస్తున్నాయి. వారిని మర్చిపోయిన వారు రామద్రోహులే. బాబ్రీ మసీదు ఘటనలో పాత్ర ఉన్న శివసేనకూ భూమిపూజలో పాల్గొనేందుకు ఆహ్వానం అందలేదు. బాబ్రీ యాక్షన్ కమిటీ ఇక్బాల్ అన్సారీకి ఆహ్వానం అందింది. చారిత్రక తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్కీ ఆహ్వానం లేదు. అయోధ్య ఉద్యమంలో వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్, ఆర్ఎస్ఎస్, శివసేన కార్యకర్తలు.. లాఠీదెబ్బలు, తూటాలకు ఎదురొడ్డి రామమందిరం కోసం పోరాటం చేశారు. ప్రధాని మోదీ ప్రభుత్వ హయాంలో చట్టపరమైన సమస్యలు పరిష్కృతమయ్యాయి అనేది అంగీకరించాల్సిన విషయం. లేకపోతే పదవీ విరమణ తర్వాత జస్టిస్ రంజన్ గొగొయ్ రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యేవారు కాదు. ఈ రోజుతో రామమందిర ఆంశంపై రాజకీయాలకు తెరపడాలి. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, వామపక్షాల మనోభావాలనూ పరిగణనలోకి తీసుకోవాల్సింది."