ప్రయాణికుల భద్రతకు భారతీయ రైల్వే సముచిత ప్రాధాన్యమిస్తోందా? కొత్త లైన్ల నిర్మాణం, గేజ్ మార్పిడి, నిర్వహణ వ్యయ నియంత్రణ... వీటిలో ఏమైనా మెరుగుదల సాధ్యపడిందా? ఈ ప్రశ్నలకు, లేనే లేదన్నదే పార్లమెంటరీ స్థాయీ సంఘం నివేదిక సూటిగా చెబుతున్న సమాధానం. 2017-18 లగాయతు అయిదు సంవత్సరాలపాటు ఏటా రూ.20వేలకోట్ల వంతున ‘రాష్ట్రీయ రైల్ సంరక్షా కోశ్’ పేరిట మొత్తం లక్షకోట్ల రూపాయల నిధిని ఏర్పరచాలన్నది మూడేళ్లక్రితం జైట్లీ బడ్జెట్లో వెల్లడైన ఘనసంకల్పం. ఆ ఏడాది బడ్జెటరీ మద్దతుగా కేంద్ర విత్తమంత్రిత్వశాఖ రూ.5000కోట్లు సమకూర్చింది. దరిమిలా కథ మారింది. కేటాయింపులే నాలుగోవంతు మేర తగ్గిపోయాయని, అందులోనూ దాదాపు సగమే ఖర్చు చేస్తున్నారని తప్పుపట్టిన స్థాయీసంఘం, నిధి ఏర్పాటు తాలూకు ఉద్దేశమే దెబ్బతినిపోతున్నదని తాజాగా ఆక్షేపించింది.
రైల్వే భద్రతకు నిధుల తెగ్గోతతోపాటు నూతన మార్గాల నిర్మాణంలో మందగతీ ఆందోళనపరచేదే. 2018-19లో వెయ్యి కిలోమీటర్ల మేర కొత్త లైన్ల పని పరిపూర్తి కావాలని లక్షిస్తే, వాస్తవంలో సాధ్యపడింది 479 కిలోమీటర్లే. 2019-20లో లక్ష్యాన్ని సగానికి కుదించినా 278 కిలోమీటర్ల నిడివిలోనే నిర్మాణ పనులు పూర్తిచేయగలిగారు. అందుబాటులోని నిధులు తరిగిపోతుంటే, అందుకనుగుణంగా భద్రత పద్దుకింద వ్యయీకరణా కుంచించుకుపోతున్నదని స్పష్టమవుతూనే ఉంది. రైల్వేల పనితీరు సవ్యంగా లేదనడానికి మరో ప్రబల సూచిక, నిర్వాహక నిష్పత్తి (ఆపరేటింగ్ రేషియో- ఓఆర్). ప్రతి వంద రూపాయల ఆర్జనకు సుమారు రూ.97దాకా ఖర్చు చేయాల్సి రావడమేమిటని తప్పుపట్టిన స్థాయీసంఘం- అనవసర ఖర్చుల్ని సాధ్యమైనంతగా కట్టడి చేసి, ఆదాయం పెంచుకునే మార్గాలు అన్వేషించాలని ఉద్బోధించింది. రైల్వేల పుట్టి ముంచుతున్న కంతలు అనేకమన్నది పార్లమెంటరీ స్థాయీసంఘం నివేదిక చెప్పకనే చెప్పిన చేదునిజం!
పద్దును విస్తరించాలని ప్రతిపాదన...
మూడు నెలల క్రితం కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదికా రైల్వేల ఆర్థిక నిర్వహణపరంగా లోటుపాట్లను తూర్పారపట్టింది. భారతీయ రైల్వే ఆదాయ వ్యయనిష్పత్తి 2017-18లో పదేళ్ల అధమస్థాయికి చేరిందని, ప్రతి వంద రూపాయల రాబడిలో రూ.98.44 ఖర్చయిపోతున్నదని ‘కాగ్’ అప్పట్లో లెక్కకట్టింది. యథార్థానికి గణాంకాలు మదింపు వేసేసరికి ఎన్టీపీసీ (జాతీయ థర్మల్ విద్యుత్ కార్పొరేషన్), ఐఆర్‌సీఓఎన్ (రైల్వే నిర్మాణ సంస్థ) నుంచి అడ్వాన్సుల రూపేణా సుమారు రూ.7,300 కోట్లు సమకూరకపోయి ఉంటే- నాడు నిర్వాహక నిష్పత్తి 102.66 శాతానికి చేరేదే! తీవ్ర నగుబాటును సర్దుబాట్లతో త్రుటిలో తప్పించుకున్న భారతీయ రైల్వే, అత్యవసర మరమ్మతుల్నీ పేరబెడుతున్నదని సుదీప్ బందోపాధ్యాయ కమిటీ ఏడాది క్రితమే వెల్లడించింది.
వందేళ్లు, అంతకన్నా పైబడిన రైల్వే వంతెనలు 37 వేలకు మించి ఉన్న దేశంలో తనిఖీ, నిఘా సిబ్బంది 60 శాతం దాకా తరుగుపడ్డారన్నది దిగ్భ్రాంతపరచే వాస్తవం. 2016-17 నాటికి మూలధన పెట్టుబడిలో ఇంచుమించు 11 శాతం వరకు అంతర్గత వనరుల ద్వారా కూడగట్టుకునే స్థోమత రైల్వేలకు ఉండేది. తరవాతి మూడేళ్లూ 3-3.5 శాతానికి పడిపోయిన ఆ పద్దును ఈసారి ఎలాగైనా 4.6 శాతానికి విస్తరించాలని ఇటీవలి బడ్జెట్ ఆశావహంగా ప్రతిపాదించింది. అదెంతవరకు ఆచరణ సాధ్యమో ఎవరికీ అంతుచిక్కని తరుణంలో- రైలు ప్రయాణాన్ని సురక్షితంగా, ప్రమాదరహితంగా ఎలా తీర్చిదిద్దగలరో అనూహ్యం. రైల్వేల ఆధునికీకరణ నిమిత్తం లోగడ శ్యాం పిట్రోడా కమిటీ రూ.8.22 లక్షల కోట్ల భూరి ప్రణాళికను సూచించడం తెలిసిందే. అంతర్గత వనరుల ద్వారా ఏడాదికి ఏడెనిమిది వేలకోట్ల రూపాయల సమీకరణకే కిందుమీదులవుతున్న భారతీయ రైల్వే సొంతంగా నిలదొక్కుకోవడమన్నది పగటి కలే!
ఆరు దశాబ్దాల్లో మెరుగుదల
రమారమి 22 వేల రైళ్లలో ఏడాది కాలంలో 800 కోట్లకు పైగా ప్రయాణికుల్ని గమ్యస్థానాలకు చేర్చే భూరి రైల్వేవ్యవస్థ- ఒక్కముక్కలో, జాతికి జీవనాడి. అది గుణాత్మకంగా పరివర్తన చెందాల్సిన అవసరాన్ని వరసగా ఆర్థిక సర్వేలు ప్రస్తావిస్తూనే ఉన్నా, దీటైన కార్యాచరణ కొరవడుతోంది. ఆరున్నర దశాబ్దాల్లో రైల్వే మౌలిక వసతుల పరంగా 30 శాతం వృద్ధే సాధ్యపడిందన్న అధికారిక నిర్ధారణ, విస్తరణలో మందగతికి నిదర్శనం. అన్నం సరిగ్గా ఉడికిందో లేదో తెలుసుకోవడానికి- మెతుకు పట్టి చూస్తే చాలు. దక్షిణమధ్య రైల్వేలో అపరిశుభ్రత, నీటికొరతలపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు తక్కినచోట్లా సేవల నాణ్యత ఏ పాటిదో తెలియజెబుతున్నాయి. రైల్వేల ప్రాథమ్యాలు దారితప్పి, రాయితీలు దుర్వినియోగమై, ప్రయాణభద్రతే కొల్లబోయే దురవస్థకు- అవి ఏళ్ల తరబడి రాజకీయ చెరలో చిక్కడమే మూలకారణం.
భారతావనిని అనుసంధానించే మహత్తర పాత్ర పోషణ దృష్ట్యా- రైల్వేల్లో పరివర్తన, ప్రక్షాళన, సంస్కరణల ఆవశ్యకతను మోదీ ప్రభుత్వం సక్రమంగానే గుర్తించింది. త్వరలో నూతన సంకేత (సిగ్నలింగ్) వ్యవస్థతో రైల్వేను మలుపుతిప్పి, 2023నాటికి సంపూర్ణ విద్యుదీకరణను సాకారం చేస్తామని కేంద్రం ఇప్పటికే సంకల్పించింది. మార్పు అంతవరకే పరిమితం కాకూడదు. అయిదేళ్ల క్రితమే ఐరోపాలో అత్యంత భద్రమైన రైల్వే వ్యవస్థకు నెలవుగా డెన్మార్క్ ప్రత్యేక గుర్తింపు సాధించింది. సమయపాలనలో, భద్రతలో, సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలో మేటిగా జపాన్ దూసుకుపోతోంది. ఉపగ్రహ సంకేతాల సాయంతో ప్రమాదభరిత మార్గాల నుంచి రైళ్లను అప్పటికప్పుడు దారి మళ్ళించే నేర్పుతో- అమెరికా, చైనా వంటివి అబ్బురపరుస్తున్నాయి. వాటితో పోలిస్తే ఆధునిక వసతుల పరికల్పన, సరకు రవాణా, ప్రయాణభద్రతల్లో మన రైళ్లు చిన్నగీతలుగా మిగిలిపోయే దుస్థితిని ప్రభుత్వమే చెదరగొట్టాలి. వృత్తిపరమైన సామర్థ్యంతో తళుకులీనేలా భారతీయ రైల్వేను అన్నిందాలా పరిపుష్టీకరిస్తే దేశార్థిక సౌష్ఠవమూ ఇనుమడిస్తుంది!