"నేను ప్రచారం పొందడానికి కారణం గర్వమే. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నేను పనిచేస్తాను. ఎప్పుడూ ప్రజలు వారికి వారు గొప్పగా ఊహించుకుంటారు. అయితే ఎవరైనా గొప్పపని చేస్తే ఆశ్చర్యపోతారు. ఇలాంటి అద్భుతాలు ఎవర్నీ బాధపెట్టవు. ఏదైనా విషయం గొప్పది, అద్భుతమైనది అని ప్రజలు నమ్మాలనుకుంటారు."
- డొనాల్డ్ ట్రంప్ (ట్రంప్: ద ఆర్ట్ ఆఫ్ డీల్)
భారత ప్రధాని నరేంద్ర మోదీతో కలసి హౌడీ మోదీ వేదికను పంచుకునేందుకు డొనాల్డ్ ట్రంప్ హ్యూస్టన్ వెళ్లనున్నారు. ఈ ర్యాలీలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం జరిగే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు. బిలియనీర్ వ్యాపారి... టెలివిజన్ స్టార్ అయిన అమెరికా అధ్యక్షుడు ఈ వేదికపై భారత్‌తో విదేశాంగ విధానాలపై ఏదైనా ప్రకటన చేసే అవకాశమూ లేకపోలేదు.
టెక్సాస్ పట్టు చిక్కేనా...
2016లో టెక్సాస్ ఎన్నికల్లో ట్రంప్ పార్టీ ఓడిపోయింది. ఇప్పుడు అదే టెక్సాస్‌లో ఈ సభ విజయవంతమవడం ట్రంప్‌కు కలిసొచ్చే అంశం. మిషిగన్, పెన్సిల్వేనియా వంటి రాష్ట్రాల్లో రిపబ్లికన్ పార్టీకి ట్రంప్ విజయం దక్కేలా చూశారు. ఈ రెండు రాష్ట్రాల్లో 1988 నుంచి రిపబ్లికన్లకు ఇదే మొదటి విజయం. అయితే ఇవి తిరిగి డెమొక్రాట్ల చేతిలోకి వెళ్లిపోయాయి.
2018లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ప్రతినిధుల సభలో డెమొక్రాట్లదే పైచేయిగా మారింది. ఇప్పుడు 2020 అధ్యక్ష ఎన్నికలకు ట్రంప్ సమాయత్తమవుతున్నారు. ఈ సమయంలో ట్రంప్‌కు ప్రతి ఓటు అవసరం. టెక్సాస్ ఇందుకు మినహాయింపు కాదు. అయితే ఇక్కడ డెమొక్రాట్స్ వైపు గాలీ వీస్తోంది.
ప్రస్తుతం ట్రంప్ పాపులారిటీ రేటింగ్స్ విషయంలో కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అమెరికా ఆధునిక చరిత్రలో గాలప్స్ వీక్లీ సర్వేలో 50% మార్క్‌ను అందుకోని ఏకైక అధ్యక్షుడు ట్రంప్. అమెరికన్లు ట్రంప్ పనితనాన్ని ఏ విధంగా గమనిస్తున్నారనడానికి ఇది ఒక నిదర్శనం. ప్రస్తుతం ట్రంప్ రేటింగ్ 44.3% ఉంది. అయితే ఇది ఒబామా రెండోసారి ఎన్నికైనప్పుడు (2011 సెప్టెంబర్) కంటే ఎక్కువే. ఇది రిపబ్లికన్ పార్టీ ఎన్నికల ప్రచారానికి బలమిచ్చే అంశమే.
ట్రంప్.. ఒబామాకు తేడా...?
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఇప్పటివరకు భారత్‌లో అడుగుపెట్టలేదు. బరాక్ ఒబామా మాత్రం అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రెండు సార్లు దిల్లీ వచ్చారు. 2015 భారత గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అయితే హ్యూస్టన్ నగరంలో 50,000కు పైగా ప్రవాస భారతీయుల నడుమ ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటున్న కార్యక్రమానికి ట్రంప్ హాజరవడం ఆషామాషీ విషయం కాదు. భారతీయుల్లో మోదీ గాలి బలంగా వీస్తున్న ఈ తరుణంలో అమెరికాలోని ప్రవాసులకు దగ్గరవడం ట్రంప్‌కు కలిసొచ్చే విషయం. ఎందుకంటే రికార్డు స్థాయి మెజారిటీతో మోదీ రెండోసారి ఎన్నికయ్యారు. కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు అనంతరం అక్కడ మానవహక్కుల పరిస్థితిపై అమెరికా చట్టసభ్యులు పలుమార్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి తరుణంలో మోదీతో ట్రంప్ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ప్రవాసుల ప్రభావం...
భారతదేశం నుంచి అక్రమ వలసదారులను బహిష్కరించడానికి మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రశంసించే ప్రవాసులు సంప్రదాయకంగా డెమొక్రాట్లకు ఓటు వేస్తున్నారు. హెచ్1బీ వీసాలు, వలస నిబంధనల సమీక్షపై ట్రంప్ ప్రభుత్వ ప్రకటనలతో వీరంతా అయోమయంలో ఉన్నారు.
అమెరికన్ రాజకీయాల్లో ప్రవాస భారతీయుల ప్రభావం గణనీయంగానే ఉంది. అమెరికా జనాభాలో దాదాపు ఒక శాతం వరకు ఉన్న మైనారిటీ ఆసియా సమాజంలో భారతీయులే అధికులు.
ట్రంప్ 24 మందికిపైగా భారతీయ-అమెరికన్లను తన ప్రభుత్వంలో ఉన్నత పదవుల్లో నియమించారు. అయితే ఒబామా తన అధ్యక్ష పదవిలో ఎనిమిది సంవత్సరాల కాలంలో 50 మంది భారతీయ-అమెరికన్లను బాధ్యతాయుతమైన పదవుల్లో నియమించారు.
"విభిన్న రంగాలలో ప్రవాస భారతీయులు సాధించిన విజయాలు, వివిధ రంగాలలో అమెరికాకు వారు అందించిన సహకారం, భారతదేశంతో వారికున్న బలమైన బంధాలు, భారత్, అమెరికా రెండు ప్రజాస్వామ్య దేశాల మధ్య వంతెనగా వారు పోషిస్తోన్న పాత్ర మాకు గర్వకారణం.
అమెరికా అధ్యక్షుడు, నేను కలసి ప్రవాస భారతీయులతో అవుతున్న మొదటి భేటీ ఇది. ఇది ఓ సరికొత్త మైలురాయి.”