దేశవ్యాప్తంగా వలస కూలీల దినసరి వేతనం కనీస స్థాయి కన్నా తక్కువగా ఉంది. వ్యవసాయం గిట్టుబాటు కాక ఏకంగా 90లక్షల మంది ఏటా గ్రామాల నుంచి పట్టణాలకు వలసపోతున్నారు. దుర్భిక్ష ప్రాంతాల రైతులు, రైతుకూలీలు, భూమిలేని నిరుపేదలు, సామాజికంగా వెనకబడిన వ్యక్తులు వలస కూలీల అవతారం ఎత్తుతున్నారు. కుటుంబ పోషణార్థం రూ.200-400 కూలీకే సుదూర ప్రాంతాలకు తరలిపోతున్నారు. ఇల్లు గడిచేందుకు చేసిన అప్పులు తీర్చేందుకు ఇతర రాష్ట్రాల్లో రెక్కలుముక్కలు చేసుకుంటున్నారు. 'అంతర్గత వలస కార్మికులపై లాక్‌డౌన్ ప్రభావం' అనే అంశంపై జన్‌సాహస్ ఇండియా సంస్థ చేసిన అధ్యయనంలో వెల్లడైన విషయాలివి. కార్మికుల అవస్థలు, కుటుంబాల నేపథ్యం తదితర కోణాలను స్పృశిస్తూ సర్వే నిర్వహించింది. దేశంలో అత్యధికంగా ఐదున్నర కోట్ల మంది వలస కార్మికులు నిర్మాణ రంగంలో పనిచేస్తున్నా, నేటికీ 5.1కోట్ల మంది పేర్లు కనీసం నిర్మాణరంగ సంక్షేమ బోర్డులో నమోదు కాలేదని వెల్లడించింది. లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోవడంతో చేసిన అప్పులు తీర్చలేమన్న మానసిక ఆందోళనతో కొట్టుమిట్టాడుతున్నారని తెలిపింది. వలస కూలీల్లో అత్యధికులు సామాజికంగా వెనుకబడిన వ్యక్తులని, సరైన విద్య, ఆస్తుల్లేక దుర్భర పేదరికంలో మగ్గుతున్నారని వివరించింది. కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్రయోజనాలు కనీస అవసరాలు తీర్చలేవని దినసరి, వలస కూలీలు అభిప్రాయపడినట్లు పేర్కొంది.
వలస కూలీల దినసరి వేతనం 'కనీస కూలీ' కన్నా తక్కువే! - migrant workers wages in India
దేశంలో వలస కూలీల దినసరి కూలీ కనీస స్థాయి కన్నా తక్కువగా ఉందని తాజాగా ఓ అధ్యయనం పేర్కొంది. 'అంతర్గత వలస కార్మికులపై లాక్‌డౌన్ ప్రభావం' అనే అంశంపై చేసిన అధ్యయనంలో కీలక విషయాలు వెల్లడించింది. రోజువారీ సంపాదన రూ.200-400 కోసం రెక్కలు ముక్కలు చేసుకుంటున్నారని తెలిపింది.
కనీస కూలీ కన్నా కనిష్ఠం!
చేయాలిలా...
- విపత్తుల వేళ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ఆర్థిక సహాయం అందించాలి.
- నిర్మాణరంగ బోర్డులో నమోదు కాని భవన నిర్మాణ కార్మికుల పేర్లను రిజిస్టరు చేయాలి.
- ఉపాధి కోల్పోయినందున ఆర్నెల్లపాటు ప్రధాన మంత్రి సహాయ నిధి నుంచి కనీస వేతనాలందించాలి.
- వలస కార్మికుల నిత్యావసరాల కోసం ఆర్నెల్లపాటు నెలకు రూ.1000 నుంచి రూ.1500 చొప్పున బ్యాంకు ఖాతాల్లో జమచేయాలి.
- వలస కార్మికులు బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను రద్దుచేయాలి. ప్రైవేటు రుణదాతలు మూడు నెలల వరకు బాకీలు వసూలు చేయకుండా నియంత్రించాలి.
ఇదీ చూడండి: 'అక్కడ చైనా వచ్చింది.. ఇక్కడ మోదీ అదృశ్యమయ్యారు'