శబరిమల ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళలకు ప్రవేశం సహా వివిధ కేసుల్లో దాఖలయ్యే పునఃసమీక్ష పిటిషన్లపై విచారణ సందర్భంగా ఉత్పన్నమయ్యే ప్రశ్నలను.... విస్తృత ధర్మాసనానికి నివేదించే అంశంపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. ఆయా కేసులకు సంబంధించి ఈనెల 3న జరిగిన విచారణ సందర్భంగా పునఃసమీక్ష పరిధి ప్రకారం ప్రశ్నలను విస్తృత ధర్మాసనానికి నివేదించే అధికారం సుప్రీంకోర్టుకు లేదని పలువురు న్యాయవాదులు వాదనపై అత్యున్నత న్యాయస్థానం తేల్చనుంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని 9 మంది సభ్యుల విస్తృత ధర్మాసనం ఈ అంశంపై విచారణ చేపట్టింది.
శబరిమల ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలయ్యాయి. వాటితో పాటు మసీదుల్లోకి ముస్లిం మహిళల ప్రవేశం, దావూది బోహ్రా ముస్లిం వర్గంలో మహిళలకు సున్తీ చేయించడం, ఇతర మతస్థులను వివాహం చేసుకున్న పార్శీ మహిళల హక్కులను హరించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై గతంలో అయిదుగురు సభ్యుల ధర్మాసనం విచారణ జరిపింది.