లోక్‌సభ సభ్యుల సంఖ్యను ప్రస్తుతమున్న 543 నుంచి వెయ్యికి పెంచాల్సిన అవసరం ఉందని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా రాజ్యసభలోనూ బలం పెరగాలన్నారు. రాష్ట్రాల అసెంబ్లీల సభ్యుల సంఖ్యనూ పెంచాలని సూచించారు. ఎన్నికైన ప్రజాప్రతినిధుల సంఖ్య ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా లేదని అభిప్రాయపడ్డారు. సోమవారం ఆయన దిల్లీలో జరిగిన ఇండియా ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో ఆటల్ బిహారీ వాజ్పేయీ స్మారకోపన్యాసం చేశారు.
'లోక్‌సభ సభ్యుల సంఖ్య 1000కి పెంచాలి'
దేశ జనాభాకు అనుగుణంగా లోక్‌సభ సభ్యుల సంఖ్యను 543 నుంచి వెయ్యికి పెంచాలని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అభిప్రాయపడ్డారు. తదనుగుణంగా రాజ్యసభ స్థానాలు కూడా పెంచాలని సూచించారు. ప్రజాప్రతినిధులు.. ఓటర్ల సంఖ్య మధ్య నిష్పత్తిలో భారీ అసమానతలు ఉన్నాయన్నారు.
1977లో చివరిసారిగా లోక్‌సభ సభ్యుల సంఖ్యను సవరించారని ప్రణబ్ చెప్పారు. 1971నాటి జనాభా లెక్కల ఆధారంగా ఆ కసరత్తు చేశారని, అప్పట్లో జనాభా 55కోట్లు మాత్రమేనని తెలిపారు. ఆ తర్వాత ఈ జనాభా రెట్టింపు కన్నా ఎక్కువగా పెరిగిందన్నారు. ప్రస్తుతం 16-18లక్షల మందికి ఒక లోక్‌సభ సభ్యుడు ఉంటున్నారని పేర్కొన్నారు. అంతమందికి ఎంపీ ఎలా చేరువ కాగలరని ప్రశ్నించారు. బ్రిటీష్ పార్లమెంటులో 650మంది సభ్యులు ఉన్నారని, కెనడాలో 443మంది ఎంపీలు ఉన్నారని గుర్తుచేశారు.
అధికారంలో ఉన్న పార్టీలు అధిక సంఖ్యాకవాదానికి దూరంగా ఉండాలని ప్రణబ్ సూచించారు. అందరినీ కలుపుకొని వెళ్లే విధానాన్ని అనుసరించాలన్నారు.
ఇదీ చూడండి : 28వ సైన్యాధ్యక్షుడిగా జనరల్ ముకుంద్ నరవాణే