కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన లాక్డౌన్.. పేదల నిస్సహాయతను అడుగడుగునా వెక్కిరిస్తోంది. మహారాష్ట్రలో ఇప్పటికే ఉపాధి కోల్పోయి పొట్టకూటికి తిప్పలు పడుతున్న రషీదా.. పురిటి నొప్పులతో రోడ్డెక్కి.. రవాణా సౌకర్యం లేక అవస్థలు పడాల్సొచ్చింది. ప్రసవం తర్వాత ఒంట్లో రక్తం తగ్గి.. రక్తం కోసం నవజాత శిశువును ఒడిలో మోస్తూ.. మండుటెండలో ఏడు కిలోమీటర్లు నడవాల్సిన దుస్థితి ఏర్పడింది.
నెత్తుటి కష్టాలు...
పాల్ఘడ్ జిల్లా మనోర్లోని తమ్సాయి గ్రామానికి చెందిన రషీదా ఖతున్కు పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. భర్త సద్దాం హుస్సేన్ ఆమెను మనోర్ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాడు. సహజ ప్రసవంలో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది రషీదా. ప్రసవం సమయంలో అధిక రక్తస్రావం జరగడం వల్ల రషీదాకు రక్తం ఎక్కించాల్సొచ్చింది. కానీ, పాల్ఘడ్లో ఆమెకు కావల్సిన ఓ-నెగెటివ్ గ్రూపు రక్తం దొరకలేదు. దీంతో అంబులెన్స్‌లో ఠాణే జిల్లా ఆసుపత్రికి వెళ్లారు ఆ దంపతులు.
కానీ, అక్కడ ఓ-నెగెటివ్ రక్తానికి బదులుగా అదే గ్రూపు రక్తం ఇస్తేనే ఆమెకు రక్తమార్పిడి చేస్తామని తేల్చిచెప్పేశారు. వారి దయనీమ పరిస్థితికి జాలిపడకపోగా.. ఫీజు పేరిట రూ.3000/- వసూలు చేశారు ఆ సర్కారు ఆసుపత్రి సిబ్బంది. తిరిగి ఇంటికి వెళ్లిపోదామంటే, రవాణా సౌకర్యం లేదు.