కరోనా మహమ్మారి వ్యాప్తితో విధించిన లాక్డౌన్ వల్ల ఆర్థికంగా చాలా మంది కుంగిపోయారు. నిరుపేద కుటుంబాల పరిస్థితి దారుణంగా మారిపోయింది. కనీస సంపాదన లేక ఉంటున్న ఇంటికి అద్దె కట్టడం కోసం మూడేళ్ల కూతురిని అమ్మింది ఓ తల్లి. ఈ హృదయ విదారకర ఘటన కర్ణాటక బెంగళూరులో జరిగింది.
ఇంటి అద్దె కోసం బిడ్డను అమ్మిన తల్లి ఇదీ జరిగింది.
నెలమంగళలోని రేణుకా నగర్‌లో నివసిస్తున్న నాగలక్ష్మీది నిరుపేద కుటుంబం. ఆమెకు ముగ్గురు సంతానం. అందులో ఇద్దరు ఆడపిల్లలు. కొన్ని రోజుల క్రితం భర్త శంకర్ కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవటం వల్ల ఒంటరిగా జీవిస్తోంది. కుటుంబపోషణ కోసం ఓ హోటల్‌లో పనిచేసేది.
10 నెలల క్రితం ఆమె మగబిడ్డ చనిపోయాడు. ఇద్దరు ఆడ పిల్లల్లో ఒకరిని అమ్మమ్మ గారి ఇంటికి పంపి, మరొక బిడ్డను తన దగ్గర ఉంచుకుంది. కరోనా లాక్డౌన్ వల్ల హోటల్ తాత్కాలికంగా మూసివేశారు. దీంతో సంపాదన కరవైంది. చివరకు ఇంటి అద్దె కట్టలేని పరిస్థితి ఏర్పడింది.
నాగలక్ష్మీ దుస్థితిని గమనించిన పొరుగింటి సంగీత.. తన మూడేళ్ల పాపను అమ్మమని సలహా ఇచ్చింది. ఆ పాపను తుమ్మకూరుకు చెందిన కృష్ణమూర్తికి రూ.11 వేలకు అమ్మేందుకు ఆ తల్లిని ఒప్పించింది. ఆగస్టు 11న రూ.50 బాండ్ పేపరు మీద ఒప్పందం చేసుకొని కృష్ణమూర్తి.. పాపను తీసుకొని డబ్బులు మాత్రం తర్వాత చెల్లిస్తానని చెప్పి వెళ్లిపోయాడు. కానీ ఆ తర్వాత కృష్ణమూర్తి ఆచూకీ లేదు. దీంతో నాగలక్ష్మీ.. నెలమంగళ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... కృష్ణమూర్తి నుంచి ఆ పాపను తీసుకొని కన్నతల్లికి అప్పగించారు.