సేవకు మార్గం చూపించిన క్యాన్సర్ సచిన్, భవ్య... కేరళ మలప్పురంలోని నీలంబర్ భూతనామ్ వాసులు. వారిది ప్రేమ వివాహం. కానీ... కొన్నాళ్ల క్రితం భవ్యకు క్యాన్సర్ సోకింది. అయినా... మనోధైర్యంతో ఎదుర్కొన్నారు ఆ యువ దంపతులు.
కష్టకాలంలో చుట్టుపక్కల వారు ఎంతో సహకారం అందించారు. అప్పుడే... పరులకు సాయం చేయటంలో ఉన్న మాధుర్యాన్ని గుర్తించారు సచిన్, భవ్య. క్యాన్సర్‌పై పోరాటంలో విజయానికి సమాజం ఇచ్చిన చేయూతే కారణమని విశ్వసించారు. అలా వారిలో సామాజిక బాధ్యత పెరిగింది.
ఇప్పుడు సచిన్, భవ్యల చుట్టుపక్కల వారికి కష్టమొచ్చింది. వరద విలయంతో కేరళలోని అనేక ప్రాంతాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. వారికి తమవంతు సాయం అందించాలని సంకల్పించారు ఆ యువ దంపతులు. అలాగని వారికి పెద్దగా ఆస్తులు లేవు. అయినా... తమ బాధ్యత నెరవేర్చడం కోసం ఓ మంచి నిర్ణయం తీసుకున్నారు. తమ దగ్గరుండే ఖరీదైన ద్విచక్రవాహనాన్ని అమ్మి, ఆ డబ్బును ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. బైక్‌పై ఇద్దరూ చక్కర్లు కొట్టాలన్న కోరిక కంటే సమాజానికి ఏదైనా చేయటంలోనే ఆనందాన్ని వెతుక్కుంటున్నారు సచిన్, భవ్య.
ఇదీ చూడండి: గాంధీ కోసం... అబలలు ఆభరణాలు ఇచ్చేశారట!