కొనఊపిరితో పోరాడుతున్న పేషెంట్లను వాహనంలో ఎక్కించుకుని.. రోడ్లు ఎలా ఉన్నా వేగంగా, సురక్షితంగా ఆసుపత్రికి చేర్చడం అంటే మాటలా? అందుకే, అంబులెన్స్ డ్రైవర్ ఉద్యోగంలో చేరడమంటే పెద్ద సవాలే. అయితే, ఆ సవాళ్లను సునాయాసంగా స్వీకరించింది తమిళనాడుకు చెందిన ఓ వీర వనిత. దేశంలోనే తొలి మహిళా అంబులెన్స్ డ్రైవర్గా బాధ్యతలు చేపట్టింది.
థేని జిల్లాకు చెందిన వీర లక్ష్మీ.. భర్త ఓ ట్యాక్సీ డ్రైవర్. భర్త ఒక్కడి సంపాదనతో ఇల్లు గడవడం కష్టంగా మారింది. దీంతో తమ ఇద్దరు బిడ్డలను ప్రభుత్వ బడిలో చేర్చి.. తానూ ట్యాక్సీ డ్రైవర్గా మారింది లక్ష్మీ. బంధువులు, ఇరుగు పొరుగు వారు దెప్పి పొడుస్తున్నా.. వెనకాడలేదు. భర్త ప్రోత్సాహం ఉంటే చాలనుకుని సాగిపోయింది. కరోనా లాక్డౌన్ వేళ.. చెన్నై ప్రభుత్వాసుపత్రిలో అంబులెన్స్ డ్రైవర్లు కావాలంటూ విడుదలైన ఓ ప్రకటన వీరలక్ష్మీ కంటపడింది.