రంజాన్ మాసంలో ముస్లింలు ఉపవాసం పాటిస్తారు. ఈ సమయంలో పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టుకోకుండా పవిత్రంగా ఉంటారు. సైన్యంలోని ముస్లింలు తమ విధులు నిర్వర్తిస్తూనే.. ఉపవాసం కొనసాగిస్తున్నారు. అయితే.. ఇస్లామిక్‌గా చెప్పుకునే ఉగ్రవాదులు బుధవారం సాయంత్రం జమ్ముకశ్మీర్‌లో ఇఫ్తార్ కోసం బ్రెడ్ కొనుగోలు చేస్తున్న ఇద్దరు ముస్లిం జవాన్లపై కాల్పులు జరిపి పొట్టనపెట్టుకున్నారు. ఉపవాస దీక్షలోనే దేశం కోసం ప్రాణాలర్పించారు జవాన్లు.
ఇదీ జరిగింది..
శ్రీనగర్‌లోని పాండచ్ ప్రాంతంలో బీఎస్ఎఫ్ 37వ బెటాలియన్‌కు చెందిన జియా ఉల్ హక్, రానా మొండల్ విధులు నిర్వర్తిస్తున్నారు. ఉపవాసం ముగించుకుని ఇఫ్తార్ కోసం బ్రెడ్ కొనేందుకు బుధవారం(మే20న) సాయంత్రం మార్కెట్‌కు వెళ్లారు. అప్పటికే మార్కెట్ రద్దీగా ఉంది. ఆ సమయంలో ద్విచక్రవాహనంపై వచ్చిన ముష్కరులు హక్, మొండాల్పై కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ఒకరు, చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు.
పాకిస్థాన్ ఆధారిత లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టన్స్ ఫ్రండ్ (టీఆర్ఎఫ్).. ఈ దాడికి బాధ్యత వహించింది.