భూమండలం మీద ఏ ఖండం ఓటర్లతో సరిపోల్చినా ఇండియాలో ఓటర్ల సంఖ్యే ఎక్కువ. భారతావనిలో ఎన్నికల్ని లోగడ వాజ్‌పేయీ ‘ప్రజాస్వామ్య కుంభమేళా’ అన్నా, నిర్వాచన్ సదన్ నేడు ‘దేశ మహోత్సవం’గా కొనియాడుతున్నా- వాస్తవానికి అవి ప్రజాతంత్ర విలువల్ని, స్ఫూర్తిని బహిరంగంగా బలి ఇస్తూ జరుగుతున్న జనస్వామ్య జాతర! స్వేచ్ఛగా సక్రమంగా ఎన్నికల నిర్వహణకు రాజ్యాంగబద్ధంగానే విశేషాధికారాలు దఖలుపడిన ఎలెక్షన్ కమిషన్, ప్రజాస్వామ్య క్రతువు వన్నెలీనడానికి 1998, 2004, 2015 సంవత్సరాల్లో విపుల ప్రతిపాదనల్ని కేంద్రానికి సమర్పించింది. వాటిని ప్రభుత్వం వాటంగా అటకెక్కించేయడంతో, ప్రజాప్రయోజన వ్యాజ్యాల విచారణ సందర్భంగా ‘సుప్రీం’ ఇచ్చే ఆదేశాల అమలుకే పరిమితమవుతున్న ఈసీ- కొత్తగా పాతిక సూచనలతో ప్రజల ముందుకొచ్చింది. నిరుటి సార్వత్రిక ఎన్నికల దరిమిలా భిన్న అంశాలపై ఏర్పాటు చేసిన తొమ్మిది కార్యబృందాల సిఫార్సుల్ని క్రోడీకరించి వాటిపై సలహాలు కోరుతోంది. ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు, చిరునామా మార్పు, పేర్ల తొలగింపు వంటివాటికి వేర్వేరుగా సమర్పించాల్సి ఉన్న పత్రాలు ఓటర్లకు అసౌకర్యంగా ఉన్నాయంటూ- అన్ని సేవలకూ ఒకటే పత్రాన్ని సరళంగా అందించాలని ఈసీ ప్రతిపాదిస్తోంది. అసలు ఈ పని ఏనాడో చేయాల్సింది!
17 ఏళ్లకే వివరాల సేకరణ...
ఎనభయ్యేళ్లు పైబడిన వయోజనులు, దివ్యాంగులకు ఈ తరహా సేవల్ని ఇంటి దగ్గరే అందించే చొరవ చూపుతామంటే- కాదనేదెవ్వరు? 17 ఏళ్ల పిల్లలందరి వివరాల్ని ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకొని, 18 ఏళ్లు రాగానే ఓటర్లుగా వారిని గుర్తించాలన్న ప్రతిపాదనా బాగుంది. ఏడాదికి నాలుగుసార్లు ఓటర్ల నమోదుకు అవకాశం, ఎలెక్ట్రానిక్ ఓటరు గుర్తింపు కార్డుల జారీ వంటివీ మెచ్చదగిన ప్రతిపాదనలే. ఎన్నికల వేళ ఓటరుగా నమోదైనచోట లేకపోవడంవల్ల 30శాతం ఓటర్లు తమ హక్కు వినియోగించుకోలేక పోతున్నారంటూ- వారికి సౌలభ్యంగా భిన్న ఓటింగ్ విధానాల్ని ఈసీ పరిశీలిస్తోందట. ఎన్నికల్లో రాజకీయ పక్షాలు చేసే వ్యయానికీ పరిమితులు నిర్ధారించాలన్న ప్రతిపాదన వీనులవిందుగా ఉన్నా- భారత ప్రజాస్వామ్యాన్ని కరిమింగిన వెలగపండు చేస్తున్న భ్రష్టాచారాలన్నీ అంతటితోనే మటుమాయమైపోతాయా?
వ్యయ పరిమితులు...
ఇండియాలో ఎన్నికలంటే, అక్షరాలా ధనస్వామ్యం దాదాగిరీ. అమెరికా అధ్యక్ష ఎన్నికల కంటే అదనంగా మరో పాతిక శాతం (దాదాపు రూ.55-60 వేల కోట్లు) ఖర్చుతో నిరుడు జరిగిన సార్వత్రిక సమరానికి సరిపోలిక లేదని సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ (సీఎంఎస్) అధ్యయనం చాటుతోంది. ఎన్నికల బరిలోని అభ్యర్థుల మధ్య పోటీ సమాన ఫాయాలో ఉండాలన్న సమున్నత ఆదర్శంతోనే ఆయా రాష్ట్రాల్లో వ్యయ పరిమితుల్ని ఈసీ నిర్దేశిస్తోంది. అంతకు లోబడే వ్యయీకరించామంటూ తప్పుడు ప్రమాణపత్రాల సమర్పణతోనే గెలిచినవాళ్ల ‘ప్రజాసేవా ప్రస్థానం’ మొదలవుతుండగా, వాళ్ల పక్షాన సంబంధిత పార్టీలు, అయినవాళ్లు పారించే నిధుల ప్రవాహాలు- సమస్త విలువల్నీ నిలువునా ముంచేస్తున్నాయి. ఈ ఉపద్రవాన్ని నివారించేలా, అభ్యర్థికి నిర్ణయించిన వ్యయ పరిమితిలో గరిష్ఠంగా సగం మొత్తాన్ని పార్టీ ఎంతమంది అభ్యర్థుల్ని నిలబెడితే అంతతో హెచ్చించి- ఆ మేరకే ఖర్చు చెయ్యాలని 2015లోనే ప్రతిపాదించామని ఈసీ చెబుతోంది.