రఫేల్...! ఎన్నికలకు ముందు రాజకీయ దుమారం రేపుతున్న అంశం. విమాన కొనుగోలు ఒప్పంద పత్రాలు రక్షణ శాఖ కార్యాలయం నుంచి మాయమయ్యాయని ఇటీవల సుప్రీంకోర్టుకు నివేదించింది కేంద్రం. ఇంత కీలకమైన కేసులో పత్రాలు మాయం కావడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేసింది అత్యున్నత న్యాయస్థానం.
రఫేల్ పత్రాల మాయం... గతంలో జరిగిన సంఘటనలను గుర్తుకుతెచ్చింది. ఇంతకుముందు ఇలాంటి ఘటనలెన్నో జరిగాయి. అయోధ్య భూవివాదం కేసు, 1975 ఎమర్జెన్సీ, ఆర్టికల్ 35-ఏ, బొగ్గు కుంభకోణం దస్త్రాలూ చోరీకి గురయ్యాయి.
రఫేల్ ఒప్పందం
రఫేల్ యుద్ధ విమానాలను ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకుంది భారత్. ఇందులో భారీ అవినీతి జరిగిందన్న విపక్షాల ఆరోపణ. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ రఫేల్ మాట తీయని ప్రసంగం ఉండదంటే అతిశయోక్తి కాదు.
రఫేల్ ఒప్పందంలో అవినీతి జరిగిందంటూ దాఖలైన వ్యాజ్యాలను డిసెంబరు 14న కొట్టివేసింది సుప్రీంకోర్టు. ఈ తీర్పును పునఃసమీక్షించాలంటూ కేంద్ర మాజీ మంత్రులు పిటిషన్ దాఖలు చేశారు. విచారణ సమయంలో కేంద్రం తరఫున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్... పత్రాలు చోరీ అయ్యాయని తెలిపారు. వీటి ఆధారంగానే ఓ పత్రికలో కథనాలు ప్రచురించారని పేర్కొన్నారు. అనంతరం మార్చి 14కు విచారణ వాయిదా వేసింది కోర్టు.
అత్యయిక పరిస్థితి దస్త్రం
1975లో విధించిన అత్యవసర పరిస్థితికి సంబంధించిన దస్త్రాలు కనిపించకుండా పోయాయని 2012లో అప్పటి యూపీఏ ప్రభుత్వం పేర్కొంది. ఏకంగా ప్రధానమంత్రి కార్యాలయంలోనే మాయమయ్యాయని, సమగ్ర అన్వేషణ జరిపినా వాటి జాడ తెలియలేదని తెలిపింది.
అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ, రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ మధ్య ఎమర్జెన్సీ ప్రకటనకు సంబంధించిన దస్త్రాలివి.
అయోధ్య వివాదం
రామజన్మభూమి- బాబ్రీమసీదు కేసులోనూ ఇదే పునరావృతమైంది. 2009లో ఈ కేసుకు సంబంధించిన 23 పత్రాలు పోయాయని, సీబీఐను జోక్యం చేసుకోవాల్సిందిగా అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది.
2000 సంవత్సరంలో అయోధ్య వివాదానికి సంబంధించిన దస్త్రాలతో దిల్లీకి వెళ్లే క్రమంలో ప్రత్యేకాధికారి సుభాశ్భాన్ సాద్ రైలు ప్రమాదంలో మరణించారు. ఆ సమయంలో పత్రాలు మాయమయ్యాయి.
బొగ్గు కుంభకోణం
1993 నుంచి 2004 మధ్యలో బొగ్గు కుంభకోణానికి సంబంధించిన కీలక పత్రాలు కనిపించడం లేదని 2013 ఆగస్టులో అప్పటి బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ పేర్కొన్నారు.