జమ్ముకశ్మీర్‌లో ఒకప్పుడు ఉగ్రవాదులు జనావాసాల్లోనే ఉంటూ హింసాత్మక ఘటనలకు పాల్పడేవారు. కానీ, కొద్ది రోజులుగా ఉగ్రమూకలపై సైన్యం ఉక్కుపాదం మోపుతున్న క్రమంలో అది అత్యంత ప్రమాదకరంగా మారింది. అందుకే సైన్యం కంటికి కనబడకుండా ఉంటూ దాడులకు పాల్పడేందుకు కొత్త కొత్త పద్ధతులను అవలంబిస్తున్నారు ముష్కరులు. అందుకోసం శౌచాలయాల సెప్టిక్ ట్యాంకులు, భూగర్భ బంకర్లు, నకలీ గుంతలు, కాలానుగుణంగా ప్రవహించే నదుల కింద ఇనుప పెట్టెలను ఏర్పాటు చేసుకుని ఆశ్రయం పొందటం ఇప్పుడు నయా ట్రెండ్‌గా మారింది.
ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లలో పలువురు కీలక ఉగ్రనాయకులు మరణించటం, భారీగా నష్టం ఏర్పడుతున్న క్రమంలో ముష్కరులు, వారి సన్నిహితులు ప్రత్యామ్నాయాలవైపు చూస్తున్నట్లు చెబుతున్నారు సైనికాధికారులు.
" భూగర్భ బంకర్లు, నకలీ గుంతలు వంటివి కొత్తేమీ కాదు. కానీ ప్రస్తుతం దక్షిణ కశ్మీర్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓ కేసులో టాయిలెట్ సెప్టిక్ ట్యాంకు లోపల ఓ ఉగ్రవాది దాగి ఉండటం గుర్తించాం. ఈ ఏడాది మార్చిలో అనంత్‌నాగ్ జిల్లాలోని వత్రిగామ్ ప్రాంతంలో రహస్య బంకర్‌ను గుర్తించాం. మా దృష్టి మరల్చేందుకు టాయిలెట్ సీటుపై మానవ మలమూత్రాలు ఉన్నప్పటికీ.. విరిగిన పలకలు, కొత్త తెల్ల సిమెంట్ అక్కడ ఏదో ఉన్నట్లు తెలిపాయి. తవ్వి చూశాం. కింది నుంచి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదులను మట్టుబెట్టాం. "
- దిల్బాగ్ సింగ్, జమ్ముకశ్మీర్ డీజీపీ