తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి బలగాలను ఉపసంహరించి, శాంతిని పునరుద్ధరిద్దామంటూ చైనా చెబుతున్న మాటల్లో నిజాయితీ కనిపించడంలేదు. సైన్యాన్ని వెనక్కి తీసుకునే విషయంలో నిబద్ధతను ప్రదర్శించడంలేదు. పాంగాంగ్ ప్రాంతంలో తన బలగాలను కొనసాగిస్తోంది. అక్కడి ప్రతిష్టంభనపై భారత్‌తో చర్చించేందుకూ ఇష్టపడటంలేదు. ఎల్‌ఏసీని ఏకపక్షంగా మార్చాలన్న ఆ దేశ దుర్బుద్ధికి ఇది నిదర్శనంగా నిలుస్తోంది. ఫలితంగా భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంలేదు. ఈ నేపథ్యంలో వివాదాన్ని పరిష్కరించేందుకు రెండు దేశాల సీనియర్ సైనిక కమాండర్లు ఆదివారం కీలక చర్చలు జరిపారు.
కొద్ది నెలలుగా భారత్, చైనాల మధ్య ఎల్‌ఏసీ వెంబడి పలుచోట్ల తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇరు దేశాలూ భారీగా సైనికులు, యుద్ధవిమానాలు, ట్యాంకులు, శతఘ్నులను మోహరించాయి. ఉన్నత స్థాయిలో చర్చల అనంతరం.. ఘర్షణ ప్రాంతాల నుంచి బలగాలను ఉపసంహరించాలని నిర్ణయించాయి. ఈ మేరకు పలు చోట్ల సైన్యాలు వెనక్కి మళ్లాయి.