కరోనావైరస్ వ్యాప్తితో పాఠశాలలను మూసివేసింది ప్రభుత్వం. కానీ విద్యార్థుల భవిష్యత్తు రీత్యా ఆన్లైన్ క్లాసులకు అనుమతినిచ్చింది. దీంతో విద్యార్థులు చరవాణి, ఇతర సాధనాల ద్వారా క్లాసులు వింటున్నారు. కానీ నిరుపేద విద్యార్థుల ఫోన్ కొనుక్కునే స్తోమత లేక, క్లాసులు వినలేక చదువుకు దూరంగా ఉంటున్నారు. అలాంటి వారి కోసం సరికొత్త పద్ధతిని కనుగొన్నారు ఝార్ఖండ్ డుమ్కా డుమార్థర్ గ్రామానికి చెందిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు.
విద్యార్థుల అవస్థలను గమనించిన ఉత్తమద్ మిడిల్ స్కూల్ ప్రిన్సిపాల్ సపన్ కుమార్కు ఆన్లైన్ క్లాసులు కాకుండా నేరుగా వారి ఇళ్లలోనే పాఠాలు నేర్పించాలనే ఆలోచన వచ్చింది. దీంతో మహమ్మారి వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని సామాజిక దూరాన్ని పాటిస్తూ విద్యార్థులకు బోధించటానికి వారి ఇళ్ల గోడలను బ్లాక్ బోర్డులుగా మలిచారు. "శిక్షా ఆప్కే ద్వార్" కార్యక్రమం కింద విద్యార్థుల ఇళ్ల గోడలపై 100కు పైగా బ్లాక్ బోర్డులుగా మార్చినట్లు సపన్ కుమార్ వెల్లడించారు.
'కొవిడ్ ప్రభావం విద్యావ్యవస్థపై ఎక్కువగా పడింది. ఈ ప్రాంత విద్యార్థులకు స్మార్ట్‌ఫోన్లు లేవు. భౌతిక దూరాన్ని కొనసాగిస్తూ పిల్లలకు విద్యను అందించడానికి మేము శిక్షా ఆప్కే ద్వార్ను (మీ ఇంటి వద్ద విద్య) ప్రారంభించాము. వారి ఇళ్ళ వద్దే బోధించటం కోసం గోడలపై 100 కు పైగా బ్లాక్ బోర్డులను సృష్టించాము.'అని ఒక ఉపాధ్యాయుడు చెప్పారు.
ఈ ప్రాంత ఉపాధ్యాయులు తీసుకున్న ఈ నిర్ణయాన్ని దుమ్కా డిప్యూటీ కమిషనర్ బీ. రాజేశ్వరి ఎంతో ప్రశంసించారు. ఈ పద్ధతిని ఇతర ఉపాధ్యాయులు అనుసరించటానికి ఎంతో దోహదపడుతుందని అన్నారు.