సృజనాత్మక బోధన, అభ్యసన పద్ధతులు, జాతి రత్నాలను ప్రాథమిక స్థాయిలోనే సానపట్టే విద్యావ్యవస్థ ఉండాలని ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం గ్రహించింది. కొఠారి, ఛటోపాధ్యాయ, యశ్‌పాల్ కమిటీలు ఎన్ని సూచనలు చేసినా నేటి విద్యావ్యవస్థ నేలబారుచూపులే చూస్తోందని కాస్త ఆలస్యంగానైనా ప్రభుత్వం గ్రహించింది. పాఠశాల స్థాయి దాటుతున్నా చాలామంది విద్యార్థులు మాతృభాషలో మూడు ముక్కలు తప్పులు లేకుండా చదవడం, రాయడం చేయలేకపోతున్నారన్న చేదు నిజాలను గత ఏడాది జాతీయ సాధన సర్వే నివేదిక వెల్లడించింది. ప్రకాశించాల్సిన వజ్రాలు మట్టి పట్టి మూలన పడిఉంటే అది దేశ పురోగతికి ఎంతమాత్రం దోహదపడదని, ప్రాథమిక స్థాయిలోనే ఈ రత్నాలకు సానపట్టే గురువులకే ప్రత్యేక శిక్షణనిచ్చి విద్యార్థుల్లో విమర్శనాత్మక ఆలోచనలు పెంపొందించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం తెలుసుకోవడం మంచి పరిణామం.
కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ‘నేషనల్ ఇనీషియేటివ్ ఫర్ స్కూల్ హెడ్స్, టీచర్స్ హోలిస్టిక్ ఎడ్వాన్స్‌మెంట్’ (నిష్ఠ) కార్యక్రమం ద్వారా దేశంలో ఎంపిక చేసిన 120 ప్రాంతాల్లో ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. జాతీయ విద్యా పరిశోధనా మండలి (ఎన్‌సీఈఆర్‌టీ), జాతీయ విద్యా ప్రణాళిక సంస్థ (ఎన్‌ఐఈపీఏ), కేంద్రీయ విద్యాలయ సంఘటన, నవోదయ విద్యాలయ సమితి తదితర ఎంపిక చేసిన సంస్థలు భాగస్వాములు కానున్నాయి.
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు భాగస్వామ్యం కానున్న ‘నిష్ఠ’ ప్రపంచంలోనే అతిపెద్ద శిక్షణ కార్యక్రమంగా పరిగణిస్తున్నారు. విద్యార్థులను బట్టిపట్టే విధానం నుంచి బయటకు తెచ్చి స్వేచ్ఛాయుత వాతావరణంలో, సృజనాత్మకంగా సులభతర అభ్యసన, పరిశుభ్రత అలవరుచుకొని ఆరోగ్యంగా జీవించడం వంటి మార్గాలను ఎలా బోధించాలో ఇందులో గురువులకు నిపుణులు బోధిస్తారు. బడులను పరిశుభ్రంగా ఉంచడంతోపాటు పర్యావరణ పరిరక్షణలో భాగంగా బడి ఆవరణలో మొక్కలు నాటడం, వాటి సంరక్షణ, పెరటితోటల పెంపకంపై అవగాహన, జట్టు సహకారం, నాయకత్వం సహజంగా ఆచరణాత్మకంగా పిల్లలు అలవరచుకోవాలన్నది ఒక లక్ష్యం.
ప్రాథమిక స్థాయిలోనే పిల్లలు వేధింపులకు గురికాకుండా ఎలా ఉండాలి, వేధింపులకు గురైతే తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ఎలా తెలియజేయాలన్న విషయాలపై అవగాహన కలిగిస్తారు. పిల్లల లైంగిక వేధింపులకు అడ్డుకట్టవేసి, వాటిని వెలుగులోకి తీసుకురావాలంటే పిల్లలకే సరైన అవగాహన కల్పించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఇందుకు పిల్లల పరిరక్షణ చట్టం (పోక్సో)పై మొదట ఉపాధ్యాయులకు పూర్తి అవగాహన కలిగించనున్నారు. దివ్యాంగుల హక్కులతోపాటు వారిపట్ల సమాజం వ్యవహరించే తీరుపై విద్యార్థులకు వివరించనున్నారు.