తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ట్యాక్సీ రాజకీయం: రాజీవ్​కు నౌక- మోదీకి జెట్​

భారత వాయుసేన విమానాలను ప్రధాని నరేంద్రమోదీ సొంత ట్యాక్సీలుగా వాడారని కాంగ్రెస్ ఆరోపించింది. ఎన్నికల ప్రచారానికి వాడిన విమానాలకు అత్యల్పంగా రూ.744 చెల్లించారని విమర్శించింది. కాంగ్రెస్​ విమర్శలను భాజపా తిప్పికొట్టింది.

ట్యాక్సీ రాజకీయం

By

Published : May 9, 2019, 5:29 PM IST

Updated : May 9, 2019, 8:39 PM IST

ట్యాక్సీ రాజకీయం

మాజీ ప్రధాని రాజీవ్​గాంధీపై ప్రధాని నరేంద్రమోదీ ఆరోపణలు... భాజపా, కాంగ్రెస్​ మధ్య తీవ్ర మాటల యుద్ధానికి దారితీశాయి. రాజీవ్​పై మోదీ చేసిన అవినీతి ఆరోపణలపై దుమారం సద్దుమణగకముందే బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధాని. రాజీవ్​ కుటుంబం ఐఎన్​ఎస్​ విరాట్​ యుద్ధనౌకను విహార యాత్రకోసం వినియోగించిందని దిల్లీలో భాజపా ఎన్నికల ప్రచార సభలో ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై మండిపడ్డ కాంగ్రెస్.. భారత వాయుసేన విమానాలను మోదీ సొంత ట్యాక్సీల్లా వాడారని ఎదురుదాడికి దిగింది.

సుర్జేవాలా ట్వీట్​

"మోదీ.. మీ అబద్ధాలు చివరి దశకు చేరుకున్నాయి. ఎన్నికల ప్రచారానికి భారత వాయుసేన విమానాలను మోదీ సొంత ట్యాక్సీల్లా వాడారు. ఉదాహరణకు 2019 జనవరి 15న హిమాచల్​ ప్రదేశ్​లోని బలాంగీర్​ నుంచి పఠాన్​చెడా వెళ్లినందుకు అత్యల్పంగా రూ.744 చెల్లించారు. మీ తప్పులు మిమ్మల్ని వెంటాడుతుంటే.. ఇతరులపై వేళ్లు చూపిస్తున్నారు."

-రణ్​దీప్​ సింగ్ సుర్జేవాలా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి

'అసత్యాలు చెప్పడమే పని'

ఐఎన్​ఎస్​ విరాట్​ను రాజీవ్​ గాంధీ దుర్వినియోగం చేశారన్న ఆరోపణలను తిప్పికొట్టారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్​ కేడా. అది అధికార పర్యటనేనని విశ్రాంత నేవీ వైస్ అడ్మిరల్ వినోద్​ పస్రిచా ప్రకటించినా.. మోదీకి అవేమీ పట్టవని విమర్శించారు.

పవన్​ కేడా ట్వీట్
పవన్​ కేడా ట్వీట్
పవన్​ కేడా ట్వీట్

"మోదీకి నిజాలు పట్టవు. వారు చెప్పుకోవటానికి చేసిందేమీ లేదు. ఆర్నెల్లుగా రఫేల్, నిరుద్యోగం, నోట్లరద్దుపై చర్చకు రావాలంటూ రాహుల్​ సవాల్ విసురుతున్నా.. ఒక్క మాటైనా మాట్లాడరు. ఇప్పుడు 30 ఏళ్ల క్రితం జరిగిన విషయం గురించి మోదీ మాట్లాడుతున్నారు. మోదీ ఓ అబద్ధాలకోరు. మాజీ అధికారులు చెబుతున్నా మోదీ అసత్య ప్రచారం మానుకోవట్లేదు.

వైఫల్యాలనూ ఓట్లుగా మలుచుకోగలరు మోదీ. అందుకు పుల్వామా ఉగ్రదాడే ఉదాహరణ. నిఘా వ్యవస్థ భారీ వైఫల్యంతో మన సైనికులు అమరులయ్యారు. మేం మీ గురించి మాట్లాడుతుంటే రాజీవ్​ గాంధీని అడ్డం పెట్టుకుంటున్నారు. మీ ప్రభుత్వ హయాంలోనే బోఫోర్స్​ కేసులో రాజీవ్​కు దిల్లీ హైకోర్టు క్లీన్​చిట్​ ఇచ్చింది."

-పవన్​ కేడా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి

వాళ్లది విహార యాత్ర.. మాది దండయాత్ర

రాజీవ్​ గాంధీపై మోదీ వ్యాఖ్యలను సమర్థిస్తూ ఆర్థిక మంత్రి అరుణ్​ జైట్లీ కాంగ్రెస్​పై విమర్శలు గుప్పించారు.

జైట్లీ ట్వీట్​

"పనిమంతులు భారత నావికాదళాన్ని ఉగ్రమూకలపై దండయాత్రకు ఉపయోగిస్తారు. పేరుగొప్ప వాళ్లు మాత్రం కుటుంబ విహారయాత్రలకు వాడతారు."

-అరుణ్​ జైట్లీ, కేంద్ర ఆర్థిక మంత్రి

ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం రాజీవ్​పై తీవ్ర ఆరోపణలు చేశారు మోదీ. 1987 సమయంలో పది రోజుల పాటు లక్షద్వీప్​లో బంధువులు, స్నేహితులతో విహారయాత్రకు వెళ్లినప్పుడు ఐఎన్​ఎస్​ విరాట్​ను ట్యాక్సీలా వాడారని అన్నారు. ఓ యుద్ధనౌకపైకి విదేశీయులను ఎలా ఎక్కించారని ప్రశ్నించారు మోదీ.

ఇదీ చూడండి: రాజీవ్ కేసు దోషుల విడుదలపై పిటిషన్​ తిరస్కరణ

Last Updated : May 9, 2019, 8:39 PM IST

ABOUT THE AUTHOR

...view details