విభిన్నంగా దేశభక్తిని చాటి ప్రత్యేకంగా నిలవాలనుకున్నారు తమిళనాడుకు చెందిన అబ్దుల్ కలాం మక్కల్ పాతుకాపు అరకత్తలై ట్రస్టు (కలాం ట్రస్టు) నిర్వాహకులు. వేలిముద్రలతోనే తెల్లటి వస్త్రంపై రంగులద్ది.. కేవలం 26 నిమిషాల్లో 112 అడుగుల మేర జాతీయ పతాకాన్ని రూపొందించారు. భారత మిస్సైల్ మ్యాన్, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంను స్మరించుకుంటూ ఈ వినూత్న ప్రయత్నం చేశారు . ఇందుకోసం 73 మంది స్వచ్ఛంద సేవకులు(వాలంటీర్లు) శ్రమించారు. ఈ కార్యక్రమంతో అందరి దృష్టినీ ఆకర్షించారు. అతి కొద్ది సమయంలోనే మూడు రంగులద్ది.. జాతీయ జెండాగా మలిచారు. ప్రపంచ రికార్డుపైనా ఆశలు పెట్టుకున్నారు ట్రస్ట్ నిర్వాహకులు.
ప్రపంచ రికార్డు చేరేనా..?
గతంలో 69వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగానూ.. 69 మంది వాలంటీర్లు ఇలాగే వేలిముద్రలతో జాతీయ జెండా తయారు చేసి.. ప్రపంచ రికార్డు కైవసం చేసుకున్నారు. 30 నిమిషాల్లో 65 వేల వేలిముద్రలు వేసి.. అరుదైన ఘనత సాధించారు.
తాజాగా.. 73వ స్వాతంత్ర్యంలోకి అడుగుపెట్టబోతున్నందున ఆ రికార్డును అధిగమించే దిశగా కలాం ట్రస్ట్ 73 మంది స్వచ్ఛంద సేవకులను వినియోగించింది. వేలిముద్రల సంఖ్యను బట్టి.. మునుపటి రికార్డు బ్రేక్ చేశారా లేదా అన్నది త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.