తమిళనాడు హోసూర్‌లో నివాసముండే పుత్రాజ్ భార్య తేజస్వినికి ఈ ఏడాది మే 15న నెలలు నిండకుండానే పురిటి నొప్పులు వచ్చాయి. వెంటనే స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. గర్భిణికి అధిక రక్తపోటు ఉందని వైద్యులు గుర్తించారు. తల్లిని మాత్రమే కాపాడగలమని పుత్రాజ్కు చెప్పారు. తప్పని పరిస్థితుల్లో బిడ్డను నెలలు నిండకుండానే ఆపరేషన్ చేసి తీశారు. అలా 855 గ్రాముల ఆడపిల్లకు జన్మనిచ్చింది తేజస్విని.
పాప బతకటం చాలా కష్టమని వైద్యులు సహా అంతా అనుకున్నారు.
ఎంతైనా కన్నపేగుపై మమకారం ఊరుకుంటుందా...? పుట్టిన పాపను ఎలాగైనా కాపాడుకోవాలనుకున్నారు ఆ దంపతులు. తక్కువ బరువుతో పుట్టిన చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమించక ముందే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.