తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ద్రవిడనాట స్టాలిన్​కే పట్టం- డీఎంకే స్వీప్

తమిళనాడు లోక్​సభ ఎన్నికల్లో విజయం ఖాయమని మొదటి నుంచి ధీమాగా ఉన్న కాంగ్రెస్‌-డీఎంకే కూటమికే ప్రజలు పట్టం కట్టారు. డీఎంకే అధినేత కరుణానిధి లేకుండా జరిగిన ఈ ఎన్నికలు ఆ పార్టీకి సానుభూతి తెచ్చి పెట్టాయి. అన్నాడీఎంకే, భాజపాలకు అడ్డుకట్ట వేయటంలో అనుసరించిన వ్యూహాలు సత్ఫలితాలిచ్చాయి.

By

Published : May 23, 2019, 6:02 PM IST

ద్రవిడనాట స్టాలిన్​కే పట్టం... డీఎంకే క్లీన్ స్వీప్

రసవత్తరంగా సాగిన తమిళనాడు లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌-డీఎంకే కూటమి ఘన విజయం సాధించింది. భాజపా- అన్నాడీఎంకే కూటమిపై విజయఢంకా మోగించింది. గెలుపుపై రెండు కూటములూ ధీమా వ్యక్తం చేసినా చివరికి స్టాలిన్​ నేతృత్వంలోని ద్రవిడ మున్నేట్ర కళగమే(డీఎంకే) పైచేయి సాధించింది. మోదీ ప్రభంజనం ముందు ఏ కూటమీ నిలబడదన్న భాజపా ఊహాగానాలకు తెరదించుతూ.. డీఎంకే కాంగ్రెస్ కూటమి భారీ విజయం సొంతం చేసుకుంది.

భాజపా అధికార పక్షంతో... కాంగ్రెస్​ ప్రతిపక్షంతో...

దక్షిణ భారతంలో కాషాయ జెండా ఎగరేయాలని ఎప్పటి నుంచో ఊవిళ్లూరుతోంది భాజపా. అందుకే... తమిళనాట అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీతో పొత్తు పెట్టుకుని బరిలో దిగింది. ఈ వ్యూహానికి ప్రతిగా... కాంగ్రెస్ ప్రతిపక్ష డీఎంకేకు స్నేహ హస్తం చాచింది. మొదట్లో కాంగ్రెస్, డీఎంకే మధ్య సీట్ల సర్దుబాటు విషయంలో కాస్త ఇబ్బందులు ఎదురైనా... అవి తొందరగానే కొలిక్కి వచ్చాయి. భాజపాను ఓడించటమే లక్ష్యంగా ఎన్నికల క్షేత్రంలోకి అడుగు పెట్టిన ఈ కూటమి... ప్రచారంలో మోదీ ప్రభుత్వమే లక్ష్యంగా విమర్శలు చేసింది. కేంద్రంలో భాజపా సర్కార్‌ ఉంటే... రాష్ట్రాభివృద్ధి జరగదంటూ తమదైన శైలిలో ప్రచారం సాగించింది.

పోటీ చేసింది 10 స్థానాలే అయినా...

తమిళనాడు, పుదుచ్చేరిలోని మొత్తం 40 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేసింది 10 స్థానాలే అయినా.. భాజపాను పరాజయం పాలు చేయడంలో తనదైన ప్రభావం చూపగలిగింది. అందులోనూ రాష్ట్రంలో మోదీపై వ్యతిరేకత ఉండటమూ... కాంగ్రెస్-డీఎంకే కూటమి విజయాన్ని సుగమం చేసింది. అన్ని రాష్ట్రాల్లోలాగే... ఇక్కడ కూడా భాజపా జాతీయవాదం, దేశ భద్రత అంశాలు ప్రస్తావించినా అవేవీ ఆ పార్టీకి ఓట్లు తెచ్చి పెట్టలేదు. వీటికి తోడు... భాజపాతో పొత్తుపెట్టుకుని బరిలోకి దిగిన అన్నాడీఎంకే, మిత్రపక్షాలు మోదీ ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడంలో విఫలమయ్యాయి. సామాజిక మాధ్యమాల్లో భాజపా అభిమానులు పెట్టిన పోస్టులు మినహా అధికారికంగా, విశ్వాసంతో మోదీ ప్రభుత్వం గురించి ప్రజలకు చెప్పడంలో స్థానిక నాయకులే తడబడ్డారు.

ప్రచారంలో డీఎంకే హిట్​...

డీఎంకే పార్టీ ప్రధానంగా మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడంలో సఫలమైంది. నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల సామాన్య ప్రజలు, చిన్న వ్యాపారులు ఎదుర్కొన్న సమస్యలే ప్రధానంగా విమర్శనాస్త్రాలు సంధించింది. శ్రీలంకలోని తమిళుల సంక్షేమంపై కేంద్రం దృష్టి సారించకపోవడం, కావేరీ జల వివాదంలో స్పందించిన తీరు, నీట్‌ పరీక్షలో తమిళ మాధ్యమం తొలగించడం వంటి పరిణామాలతో మోదీ వ్యతిరేక పవనాలు బలంగానే వీచాయి.

ఫలించిన వ్యూహాలు..

డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌.. కాంగ్రెస్‌కు అమిత ప్రాధాన్యం ఇచ్చారు. డీఎంకే పార్టీకి గెలుపు అవకాశాలు లేని స్థానాల్లో కాంగ్రెస్‌ను బరిలో దించాలన్న డీఎంకే వ్యూహం బాగానే పని చేసింది. తమిళనాడులో భాజపాకు ఓటు బ్యాంకు 3–4 శాతానికి మించి లేనప్పటికీ.. మోదీపై ఉన్న వ్యతిరేకత ప్రభావం మాత్రం అన్నాడీఎంకేపై పడిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ అంశం కూడా డీఎంకేకు కలిసొచ్చింది. అస్థిరతతో కొట్టుమిట్టాడుతున్న అన్నాడీఎంకే పార్టీ ముందు తమిళనాడు ప్రజలకు స్టాలిన్‌ ఆశాకిరణంగా నిలిచారు. అందుకే సార్వత్రిక ఎన్నికల్లో డీఎంకేకే పట్టం కట్టారు. గత లోక్‌సభ ఎన్నికల్లో చాలా తక్కువ ఓట్లు రాబట్టుకున్న డీఎంకే... ఈసారి ఆ సంఖ్య గణనీయంగా పెంచుకోగలిగింది. దక్షిణాదిన పాగా వేయాలని చూసిన భాజపాను అడ్డుకోవటంలో విజయం సాధించింది.

ఇదీ చూడండి : కంచుకోట వయనాడ్​లో రాహుల్​ జయభేరి

ABOUT THE AUTHOR

...view details