తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ద్రవిడ సంగ్రామం 8సీట్లకే పరిమితం

అన్నాడీఎంకే, డీఎంకే... తమిళ రాజకీయ నాణేనికి రెండు వైపులు. ఎన్నిక ఏదైనా... నువ్వానేనా అన్నట్లు తలపడతాయి రెండు పార్టీలు. ఆధిక్యం వారిదే, అధికారం వారిదే. సార్వత్రిక సమరంలో మాత్రం పరిస్థితి భిన్నం. ఉదయించే సూర్యుడు, రెండాకుల గుర్తు మధ్య పోటీ 8 స్థానాల్లోనే.

ద్రవిడ సంగ్రామం 8సీట్లకే పరిమితం

By

Published : Mar 19, 2019, 7:16 PM IST

Updated : Mar 20, 2019, 12:02 AM IST

తమిళనాడులో దిగ్గజ నేతలు జయలలిత, కరుణానిధి లేకుండా జరుగుతున్న మొదటి సార్వత్రిక ఎన్నికలివి. పన్నీరు సెల్వం, పళని స్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే... భాజపాతో జట్టుకట్టింది. స్టాలిన్​ నేతృత్వంలోని డీఎంకే... కాంగ్రెస్,​ ఇతర స్థానిక పార్టీలతో కలిసి బరిలోకి దిగింది.

ప్రధాన పార్టీల పొత్తులాట... తమిళ రాజకీయ స్వరూపాన్నే మార్చేసింది. 39 లోక్​సభ నియోజకవర్గాలున్న తమిళనాడులో సీట్ల పంపకం తర్వాత డీఎంకే, అన్నాడీఎంకే నేరుగా తలపడే స్థానాలు 8 మాత్రమే. మిగిలిన చోట్ల వాటికి మద్దతిస్తున్న పార్టీల మధ్యే పోటీ.

సగానికే పరిమితం...

తమిళనాడులో 39 నియోజకవర్గాలున్నా.... సీట్ల సర్దుబాటు తర్వాత అన్నాడీఎంకే, డీఎంకేకు 20 సీట్లు మాత్రమే మిగిలాయి.

19 స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించింది అన్నాడీఎంకే. పట్టలి మక్కల్​ కచ్చి పార్టీకి 7 సీట్లు, భాజపాకు 5 సీట్లు, విజయ్​కాంత్​కు చెందిన డీఎండీకే పార్టీకి 4 సీట్లు ఇచ్చింది. మరో 3 పార్టీలకు చెరో సీటు కేటాయించింది.

డీఎంకే... మిత్రపక్షాలైన ఇందియ జననాయగ కచ్చి, కొంగునాడు మక్కల్​ దేసియ కచ్చి, కాంగ్రెస్​కు 19 సీట్లు కేటాయించింది.

ఇందియ జననాయగ కచ్చి, కొంగునాడు మక్కల్​ దేసియ కచ్చి... డీఎంకే గుర్తుపై పోటీ చేసే అవకాశముంది. పుథియ నీది కచ్చి(వెల్లోర్​) అన్నాడీఎంకే గుర్తుపై బరిలోకి దిగుతుందని సమాచారం. అదే జరిగితే... ఉదయించే సూర్యుడు, రెండాకుల గుర్తుల మధ్య 11 స్థానాల్లో ప్రత్యక్ష పోటీ ఉంటుంది.

ప్రత్యక్షంగా తలపడే స్థానాలు
దక్షిణ చెన్నై
కాంచీపురం(ఎస్సీ)
మైలాడుదురై
నీల​గిరి(ఎస్సీ)
పొల్లాచ్చి
సేలం
తిరునల్వేలి
తిరువణ్ణామలై

చెన్నైలోని మూడు లోక్​సభ స్థానాల్లో దక్షిణ చెన్నైలో డీఎంకే, అన్నాడీఎంకేతో నేరుగా తలపడనుంది. మిగిలిన ప్రాంతాల్లో అన్నాడీఎంకే మిత్ర పక్షాలను బరిలోకి దింపింది.

రెండవ దశలో ఏప్రిల్​ 18న తమిళనాడులో ఎన్నికలు జరగనున్నాయి.
ఇవీ చూడండి:'ఖాకీ ఎన్నికలుగా మార్చే యత్నం'

Last Updated : Mar 20, 2019, 12:02 AM IST

ABOUT THE AUTHOR

...view details