చైనాతో మిలిటరీ, దౌత్య స్థాయిలో జరుగుతున్న చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని భారత రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. చర్చలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. మహారాష్ట్ర భాజపా జన్-సంవాద్ ర్యాలీనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేసిన ప్రసంగంలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.
"చైనాతో మిలిటరీ, దౌత్య స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఈ నెల 6న చర్చలు సానుకూలంగా సాగాయి. ప్రస్తుత వివాదాన్ని పరిష్కరించుకునేందుకు చర్చలు కొనసాగించాలని ఇరు దేశాలు అంగీకరించాయి."
- రాజ్నాథ్ సింగ్, భారత రక్షణమంత్రి.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం.. దేశ కీర్తి ప్రతిష్టలకు ఎలాంటి భంగం వాటిల్లనివ్వదని పునరుద్ఘాటించారు రాజ్నాథ్. భారత్-చైనా సరిహద్దు వివాదం గత కొంత కాలంగా సాగుతోందని.. దానిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకోవాలని భారత్ కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు.
భారత్-చైనా సరిహద్దు వద్ద పరిస్థితులపై స్పష్టతనివ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ సహా ఇతర విపక్ష నేతలు కోరినట్టు గుర్తు చేసిన రాజ్నాథ్.. వారందరికీ పార్లమెంట్లోనే సమాధానం చెబుతానని స్పష్టం చేశారు. దేశ ప్రజలను తప్పుదోవపట్టించనని పేర్కొన్నారు.
ఇదీ చూడండి:-భారత్తో సరిహద్దు రగడపై చైనా శాంతి మంత్రం!