సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న రైతు సంఘాలతో చర్చలు జరిపేందుకు ఎల్లవేళలా సిద్ధమే అని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి పురుశోత్తం రూపాలా చెప్పారు. జనవరి 15న కేంద్రం, రైతు సంఘాల మధ్య జరగాల్సిన 9వ విడత చర్చలు యథావిధిగా కొనసాగుతాయని బుధవారం స్పష్టం చేశారు. ఇరువురి మధ్య చర్చలతోనే సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు.
సమస్య పరిష్కారానికి సుప్రీంకోర్టు కమిటీ ఏర్పాటు చేసిన నేపథ్యంలో రైతులతో చర్చలు కొనసాగుతాయా? అనే ప్రశ్నకు పైవిధంగా బదులిచ్చారు రూపాలా. చర్చలు కచ్చితంగా జరగాలన్నారు. రైతులతో సంప్రదింపులకు కేంద్రం సిద్ధమని, చర్చలకు హాజరు కావాలో వద్దో వారే నిర్ణయించుకోవాలని వ్యవసాయ శాఖ మరో సహాయ మంత్రి కైలాశ్ చౌధరి తెలిపారు.