తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ట్విట్ట​ర్​ ద్వారా ప్రజల కష్టాలు తీర్చిన 'సూపర్​ మామ్​'

ప్రధాని నరేంద్రమోదీ తొలి ఐదేళ్ల పాలనలో విదేశీ వ్యవహారాల మంత్రిగా తనదైన ముద్ర వేశారు సుష్మా స్వరాజ్. విదేశాలతో దౌత్యపరమైన అంశాలకు చెందిన శాఖగానే ఉన్న భారత విదేశాంగశాఖను ప్రజలతో మమేకం చేసి సరికొత్త రూపునిచ్చారు. విదేశాల్లో భారతీయులకు ఏ కష్టమొచ్చినా నేనున్నా అంటూ ట్విట్టర్​ ద్వారా స్పందించి వారి కష్టాలు తీర్చారు. అందుకే అంతర్జాతీయ పత్రికలన్నీ 'సూపర్ మామ్‌'గా మన చిన్నమ్మను కీర్తించాయి.

ట్విట్ట​ర్​తో ప్రజల కష్టాలు తీర్చిన 'సూపర్​ మామ్​'

By

Published : Aug 7, 2019, 6:03 AM IST

Updated : Aug 7, 2019, 9:41 AM IST

ట్విట్ట​ర్​ ద్వారా ప్రజల కష్టాలు తీర్చిన 'సూపర్​ మామ్​'

2014 ముందు వరకు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అంటే కేవలం వివిధ దేశాలతో దౌత్యపరమైన ప్రక్రియలకు మాత్రమే అన్నట్లు ఉండేది. ఆ శాఖను ప్రజలతో కూడిన విదేశీ విధానంగా మార్చిన ఘనత సుష్మా స్వరాజ్​కే దక్కుతుంది​. విదేశాల్లో ఉన్న ప్రవాస భారతీయులతో భారత సర్కారు నేరుగా మమేకమయ్యేలా చేశారు సుష్మా. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండేవారు.

ఏ దేశంలోనైనా మేం సమస్యల్లో ఉన్నామంటూ ప్రవాస భారతీయులు ట్వీట్ చేస్తే వెంటనే స్పందించి వారికి సాయం చేసేవారు సుష్మ. అందుకే ఆమెను అమెరికా ప్రఖ్యాత వార్తా పత్రిక వాషింగ్టన్‌ పోస్ట్‌ 'సూపర్‌మామ్‌'గా అభివర్ణించింది.

ఇదీ చూడండి:ట్వీట్​తోనే పర్యటకుల సమస్యల పరిష్కారం!

పాకిస్థాన్‌లోని ఓ స్వచ్ఛంద సంస్థ దగ్గర ఆశ్రయం పొందిన భారత బధిర యువతి గీతను భారత్‌కు తీసుకురాగలిగారు. మోసపూరిత వివాహ బంధంలో ఇరుక్కొని దాయాది గడ్డపై నరకయాతన అనుభవిస్తున్న యువతి ఉజ్మను తిరిగి భారత్‌కు తీసుకురాగలిగారు.

జర్మన్ కాందిశీకుల పునరావాసంలో ఇబ్బందులు పడుతున్న గురుప్రీత్‌.. ట్విట్టర్‌ ద్వారా సుష్మ సాయం కోరగా ఆమె వెంటనే స్పందించారు.

ఇదీ చూడండి:లిబియా నుంచి వచ్చేయండి: సుష్మా స్వరాజ్

పాక్​ ప్రజల మనసు గెల్చుకున్నారు...

2017లో ఓపెన్ హార్ట్ శస్త్రచికిత్స కోసం పాక్ బాలిక షిరీన్ షిరాజ్‌కు ఏడాది పాటు ఆరోగ్య వీసా ఇప్పించడం ద్వారా పాక్‌ ప్రజల మనసులను గెలుచుకున్నారు సుష్మ. మరో ఇద్దరు పాకిస్థానీలు కూడా ట్విట్టర్‌ ద్వారా సుష్మకు తమ సమస్యను చెప్పుకొని భారత్‌లో ఆరోగ్య వీసా పొందగలిగారు.

2015లో భారతీయుడ్ని వివాహం చేసుకున్న యెమన్ మహిళను ఆమె 8 నెలల బిడ్డను ఉద్రిక్త ప్రదేశం నుంచి సురక్షిత ప్రాంతానికి చేరవేసేందుకు సహకరించారు. అదే ఏడాది ఇరాన్‌లోని బస్రాలో చిక్కుకున్న 168 మందికి సాయం అందించారు. ఆ సంవత్సరంలోనే జర్మనిలోని బెర్లిన్‌లో పాస్‌పోర్టు పోగొట్టుకొని సాయం కోసం ఓ యువకుడు ట్విట్టర్‌ ద్వారా అభ్యర్థించగా అతడికి అవసరమైన సాయం చేశారు.

ఇదీ చూడండి:మేడమ్​కు ధన్యవాదాలు

ఫేస్​బుక్​తోనూ...

రిషికేష్‌లో తప్పిపోయిన నెదర్లాండ్స్‌కి చెందిన బాలిక గురించి ఆమె కుటుంబ సభ్యులు ఫేస్‌బుక్‌ ద్వారా సుష్మను సంప్రదించగా... ఆ బాలిక జాడను సుష్మ బృందం కనుక్కొని కుటుంబసభ్యులకు అందించింది.

ఇలా ఎంతో మంది సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టులను వినతులుగా స్వీకరించి వారికి శీఘ్రగతిన దౌత్యమార్గం ద్వారా సాయం అందించి భారత విదేశీ వ్యవహారాలశాఖను ప్రజలతో అనుసంధానించిన సుష్మ ఇకలేరన్న చేదు వార్తను నెటిజన్లు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

మంగళవారం సాయంత్రం 7 గంటల 23 నిమిషాల సమయంలో ఆఖరి ట్వీట్ చేసిన సుష్మ.. జమ్ము-కశ్మీర్‌కు సంబంధించిన పునర్‌విభజన బిల్లుకు పార్లమెంటు ఆమోదంపై హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి రోజు కోసం ఎన్నేళ్లుగానో ఎదురుచూస్తున్నట్లు ఆఖరి ట్వీట్​ చేశారు. అనంతరం.. తీవ్ర గుండెపోటుతో దిల్లీ ఎయిమ్స్​ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ రోజు సాయంత్రం లోధి రోడ్​ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Last Updated : Aug 7, 2019, 9:41 AM IST

ABOUT THE AUTHOR

...view details