కశ్మీర్‌లో నిర్బంధ ఉత్తర్వుల్ని సమీక్షించాలని సుప్రీం ఆదేశం
జమ్ముకశ్మీర్‌లో ఆంక్షలను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. నిర్బంధ ఉత్తర్వుల్ని సమీక్షించాలని జమ్మూ పాలనావ్యవస్థకు ఆదేశాలు జారీ చేసింది. వారంలోగా ఈ ప్రక్రియ పూర్తవ్వాలని స్పష్టం చేసింది. ఇంటర్నెట్ సేవలను శాశ్వతంగా నిలిపేసేందుకు అనుమతివ్వని పేర్కొంది సర్వోన్నత న్యాయస్థానం.
జమ్ముకశ్మీర్‌లో ఆంక్షలను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. కశ్మీర్‌లో నిషేధాజ్ఞలపై వారంలోగా సమీక్షించాలని జమ్మూ పాలనావ్యవస్థకు ఆదేశాలు జారీ చేసింది. వ్యాజ్యాలపై అన్ని పక్షాల వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం గతేడాది నవంబర్ 27న తీర్పును ఈ రోజుకు వాయిదా వేసింది.
తీర్పు సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది సర్వోన్నత న్యాయస్థానం. ఇంటర్నెట్ కూడా వాక్ స్వేచ్ఛకు మార్గమని పేర్కొన్న సుప్రీం... అంతర్జాల సేవలను శాశ్వతంగా నిలిపివేసేందుకు అనుమతించమని స్పష్టం చేసింది. సేవల నిలిపివేత ఉత్తర్వులు న్యాయ సమీక్షకు లోబడి ఉండాలని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. విద్యాసంస్థలు, ఆసుపత్రులు వంటి అవసరమైన ప్రదేశాల్లో అంతర్జాల సేవలను పునరుద్ధరించాలని సుప్రీం ఆదేశించింది.
మానవ హక్కులు, స్వేచ్ఛ సమతుల్యం అయ్యేలా చూడటమే తమ పని అని పేర్కొంది.