కరోనా మహమ్మారి రాకముందరి స్థితితో సోమవారం నుంచి పూర్తి సామర్థ్యంతో పనిచేయనుంది దేశ సర్వోన్నత న్యాయస్థానం. సోమవారం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 30 మంది న్యాయమూర్తులతో కూడిన 12 ధర్మాసనాలు రోజువారీ విచారణలు చేపట్టనున్నాయి.
దేశంలోకి కరోనా వైరస్ ప్రవేశించిన క్రమంలో మార్చి నుంచి ఇద్దరి నుంచి ముగ్గురు సభ్యులతో కూడిన 5 ధర్మాసనాలు రోజుకు 20 కేసులు విచారణ చేపడుతున్నాయి. అయితే.. సుప్రీం కోర్టు వెబ్సైట్ ప్రకారం అక్టోబర్ 12 నుంచి 2-3 మంది జడ్జీలతో కూడిన 10 ధర్మాసనాలు, రెండు ఏకసభ్య ధర్మాసనాలు రోజువారీ విచారణలు చేపట్టనున్నాయి. పూర్తిస్థాయిలో ధర్మాసనాలు అందుబాటులోకి వచ్చిన క్రమంలో న్యాయస్థానం ఉత్పాదకత రెట్టింపు కానుంది. అయితే.. కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న క్రమంలో భౌతక విచారణపై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు.