తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ప్రజాప్రతినిధుల' కేసులపై సుప్రీం కీలక ఆదేశాలు - సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ప్రజాప్రతినిధుల కేసుల సత్వర విచారణపై సుప్రీంకోర్టు లిఖితపూర్వక ఆదేశాలిచ్చింది. స్టే విధించిన చోట్ల ఆరు నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. సాక్షులకు భద్రత కల్పించే అంశంలో ట్రయల్ కోర్టులే నిర్ణయాలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

supreme court gave instructions regarding political leaders cases
'ప్రజాప్రతినిధుల' కేసులపై సుప్రీం కీలక ఆదేశాలు

By

Published : Nov 6, 2020, 8:26 PM IST

Updated : Nov 6, 2020, 9:11 PM IST

ప్రజాప్రతినిధుల కేసులపై స్టే విధించిన చోట్ల ఆరు నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ తర్వాత స్టే చెల్లుబాటు కాదన్న ఆదేశాలను అన్నికోర్టులూ పాటించాలంటూ.. జస్టిస్ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. కేసుల విచారణలో అనవసర వాయిదాలు నిరోధించాలని సూచించింది. సాక్షుల రక్షణ పథకం-2018ను అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని.. సాక్షుల భద్రతాంశాలపై ట్రయల్‌ కోర్టులే నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది.

దోషులుగా తేలిన నేతలపై జీవితకాలం నిషేధం విధించాలన్న మధ్యంతర అప్లికేషన్‌పై అఫిడవిట్‌ దాఖలు చేసేందుకు కేంద్రానికి మరో వారం గడువు ఇచ్చింది అత్యున్నత న్యాయస్థానం. ఈ అంశంపై విచారణను వచ్చే ఏడాది జనవరికి వాయిదా వేసింది.

ఖర్చులపైనా..

న్యాయస్థానాలు జారీ చేసే వారెంట్ల అమలు, సమన్ల అందజేతకు నోడల్ ప్రాసిక్యూషన్ అధికారుల నియామకం తప్పనిసరి అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థల పరిధిలోని పెండింగ్ కేసుల వివరాలు తదుపరి విచారణ తేదీ నాటికి సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దేశవ్యాప్తంగా ప్రతిజిల్లా కోర్టులో ఒక వీడియో కాన్ఫరెన్స్ గది ఏర్పాటుకు అయ్యే ఖర్చు భరించే అంశంపై.. కేంద్రం సమాధానం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.

Last Updated : Nov 6, 2020, 9:11 PM IST

ABOUT THE AUTHOR

...view details