తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నీట్​ పరీక్షలో జోక్యానికి సుప్రీం నిరాకరణ - అఖిల భారత వైద్య విద్య ప్రవేశ పరీక్ష

అఖిల భారత వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్​లో జోక్యానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. నీట్-2019 ప్రవేశ పరీక్షకు సంబంధించిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలను నిపుణుల బృందంతో సమీక్షించాలని సుప్రీంలో వ్యాజ్యం దాఖలైంది. నిపుణులు సవరించిన సమాధానాలకు అనుగుణంగా మార్కులు ఇవ్వాలన్న పిటిషన్​ను విచారించేందుకు కోర్టు నిరాకరించింది.

నీట్​ పరీక్షలో జోక్యానికి సుప్రీం తిరస్కారం!

By

Published : Jun 15, 2019, 7:16 AM IST

Updated : Jun 15, 2019, 7:42 AM IST

నీట్​ పరీక్షలో జోక్యానికి సుప్రీం నిరాకరణ

నీట్​ ప్రవేశ పరీక్ష ప్రశ్నలకు సమాధానాలను సమీక్షించేందుకు తాము నిపుణులం కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అఖిల భారత వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్-2019 ప్రశ్నలకు జాతీయ పరీక్షల ఏజెన్సీ విడుదల చేసిన సమాధానాల 'కీ' పేపర్ విశ్వసనీయతను ప్రశ్నిస్తూ హైదరాబాద్​కు చెందిన నలుగురు విద్యార్థులు కోర్టును ఆశ్రయించారు.

ఇలాంటి అంశాలపై విచారణ జరపలేమని కోర్టు వ్యాఖ్యానించింది. తమ వ్యాజ్యాన్ని ఉపసంహరించుకోవాలని జస్టిస్ అజయ్​ రస్తోగి, జస్టిస్ సూర్యకాంత్​లతో కూడిన ధర్మాసనం విద్యార్థులకు సూచించింది. విద్యార్థుల తరఫున సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వీ వాదించారు.

జాతీయ పరీక్షల ఏజెన్సీ మే 5న విడుదల చేసిన సమాధానాల్లో తప్పులున్నాయని సింఘ్వీ కోర్టు ఎదుట వాదనలు వినిపించారు.

ప్రశ్న పత్రంలోని ఐదు సమస్యలకు వేరొక సమాధానం, ఒకటి కంటే ఎక్కువ సమాధానాలున్నాయని సింఘ్వీ పేర్కొన్నారు. సమాధానాలను సరిచేయకపోతే విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందని కోర్టుకు విన్నవించారు.

"అన్ని బహుళ సమాధాన ప్రశ్నలను పరీక్షించడం కోర్టు వల్ల సాధ్యమయ్యేది కాదు. ఈ పని చేసేందుకు మేం నిపుణులం కాదు. ఇలాంటి వాటిని ఎక్కడో చోట నిరోధించాలి." - ధర్మాసనం

కోల్​కతాకు చెందిన విద్యార్థుల బృందం ఇదే విషయమై దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యం ఈ నెల 17న విచారణకు రానుంది.

నీట్ ప్రశ్నలకు సమాధానాలపై అభ్యంతరాలు తలెత్తుతున్న తరుణంలో ఈ నెల 19 నుంచి ప్రవేశాల కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది.

ఇదీ చూడండి: చమురు ఓడలపై దాడి ఇరాన్ పనే: ట్రంప్

Last Updated : Jun 15, 2019, 7:42 AM IST

ABOUT THE AUTHOR

...view details