తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'చంద్రుడిపై మనిషి నివసిస్తే ఆ ఘనత భారత్​దే' - రోవర్​

జాబిల్లి దక్షిణ ధృవంలో చంద్రయాన్​-2  కాలుమోపితే చంద్రుని రహస్యాలు చాలా వరకు తెలిసే అవకాశం ఉంది. ఆ రహస్యాలు ఏంటి? చంద్రయాన్​-2 దేని గురించి పరిశోధన చేయనుంది సహా పలు కీలక విషయాలను ఇస్రో శాస్త్రవేత్త డా. ఎమ్​ అన్నాదురై ఈటీవీ ముఖాముఖిలో వెల్లడించారు.

'చంద్రుడిపై మనిషి నివసిస్తే ఆ ఘనత భారత్​దే'

By

Published : Sep 5, 2019, 4:56 PM IST

Updated : Sep 29, 2019, 1:27 PM IST

భవిష్యత్తులో చంద్రునిపై మనిషి ఆవాసం ఏర్పాటు చేసుకుంటే.. కచ్చితంగా ఆ ఘనత భారత ప్రాజెక్ట్​కే దక్కుతుందని ఇస్రో శాస్త్రవేత్త, మంగళ్​యాన్​, చంద్రయాన్​-1కు ప్రోగ్రామ్​ డైరక్టర్​గా ఉన్న డా. అన్నాదురై స్పష్టం చేశారు. వీటితో పాటు చంద్రయాన్​-2 గురించి పలు ఆసక్తికర విషయాలు ముఖాముఖిలో పంచుకున్నారు.

ఇస్రో శాస్త్రవేత్తతో ముఖాముఖి

ప్ర. మీరు చంద్రయాన్-1 ప్రాజెక్ట్ డైరెక్టర్​గా ఉన్నారు. ఇప్పుడు చంద్రయాన్-2 జరుగుతోంది. చంద్రయాన్-1కు, చంద్రయాన్-2కి మధ్య తేడా ఏంటి?

జ. చంద్రయాన్-1 అనేది సాధారణంగా ఒక ఆర్బిటర్. భూమి నుంచి ప్రయోగించిన తర్వాత అది చంద్రుని చుట్టూ తిరుగుతుంది. ఆప్టికల్, ఎక్స్​రే, రేడియో ఫ్రీక్వెన్సీ సాంకేతికల ద్వారా చంద్రుని మీద ఏం ఉందో అర్థం చేసుకోవడానికి ఉద్దేశించింది. చంద్రయాన్-1 లో 35 కిలోల చిన్న మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ పరికరం ఉంటుంది. అది చంద్రునికి 100 కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలోనుంచి చంద్రుని మీదకు జారవిడిచింది. అది చంద్రుని చేరే లోపు ప్రయోగాలు జరిపి సమాచారాన్ని భూమి మీదకు పంపించింది. ఇందులోని పరికరాల వల్ల చంద్రునిపై ఉన్న నీటి జాడలు గుర్తించగలిగాము.

ప్ర. చంద్రయాన్-1 ప్రయోగం వల్ల మీరు సంతృప్తి చెందారా?

జ: చంద్రయాన్-1 ప్రయోగం మేము అనుకున్నదాని కంటే ఎక్కువ సంతృప్తినిచ్చింది. తొలుత చంద్రునిపై నీటి జాడలు లేవని అందరు అనుకున్నారు. ఈ ప్రయోగం వల్ల చంద్రునిపై ఉన్న వివిధ రసాయన సమ్మేళనాలను కనుక్కోగలిగాము. మూన్ ఇంపాక్ట్ ప్రోబ్​ను చంద్రుని ఉపరితలం మీదకు జార విడిచినప్పుడు వచ్చిన సమాచారంలో మాస్క్​ నంబర్ 18ని గుర్తించాము. మాస్క్ నంబర్ 18 నీటిని సూచిస్తుంది. దీని వల్ల చంద్రుని ఉపరితలంపై నీటి జాడలు ఉన్నట్లు స్పష్టమైంది. చంద్రునిపై నీటి జాడ తెలుసుకోవడమే చంద్రయాన్-1 ప్రయోగం వెనక ఉన్న ప్రథమ ఉద్దేశం.

చంద్రయాన్-2 అనేది చంద్రయాన్-1 ప్రయోగానికి కొనసాగింపు. ఇందులో చంద్రునిపై సున్నితంగా దిగడం జరుగుతుంది. చంద్రయాన్-1లో క్రాష్​ ల్యాండిగ్ చేశాము. ఇది సాఫ్ట్ ల్యాండింగ్. సాంకేతింగా చూస్తే సాఫ్ట్ ల్యాండింగ్ అనేది కఠినమైన ప్రక్రియ. చంద్రయాన్-2 లో కూడా ఒక ఆర్బిటర్ ఉంటుంది. చంద్రయాన్-1 ద్వారా సాధించిన దానిపై విస్తృతంగా పరిశోధిస్తుంది. ఉదాహరణకు చంద్రునిపై నీటి జాడను మనం గుర్తించాము. ధృవ ప్రాంతాల్లో మంచు రూపంలో ఎంత నీరు ఉంది, చంద్రుని లోపలి పొరలలో నీరు ఉండే అవకాశాలపై పరిశోధన చేస్తుంది. సాంకేతికతతో పాటు సమాచార విశ్లేషణ విషయంలో చంద్రయాన్-2 ప్రయోగం ఉన్నత స్థాయిలో ఉంటుంది.

ప్ర. దక్షిణ ధృవాన్ని ఎందుకు ఎంచుకున్నారు?

జ: సాధారణంగా అందరు శాస్త్రవేత్తల దృష్టి దక్షిణ ధృవంపై ఉంటుంది. చంద్రునిపై నీటి ఆనవాళ్లు ఉన్నాయని చెప్పిన చంద్రయాన్-1కు కృతజ్ఞతలు చెప్పాలి. ఒకవేళ మానవుడు చంద్రునిపై ఆవాసం కోసం వేళ్తే దక్షిణ ధృవం వైపే వెళ్లాల్సి ఉంటుంది. అది గనక సాకారం అయితే భారత్​ చేపట్టిన ప్రయోగానికే ఘనత దక్కుతుంది. చంద్రయాన్-2 ను ముందుగా దిగిన ప్రాంతంలో కాక భవిష్యత్తులో మానవులు దిగే ప్రదేశంలోనే దించాలనుకున్నాం.

ప్ర. ల్యాండర్ చంద్రునిపై దిగిన తర్వాత రోవర్ ఏం పని చేస్తుంది. చంద్రునిపై ఎటువంటి ప్రయోగాలు చేయాలనుకుంటున్నారు?

జ: ఇది మానవ రహిత యాత్ర. ఒకవేళ భవిష్యత్తులో మానవుడు చంద్రునిపై దిగడానికి ఉపయోగపడుతుంది. ఇందులో ఉన్న రోవర్ ల్యాండర్​తో సంభాషిస్తుంది. అదే కాక మరో రెండు పరికరాలు ఈ రోవర్ లో ఉన్నాయి. చంద్రయాన్-2లోని ప్రజ్ఞాన్​ రోవర్లో ఉన్న రెండు పరికరాలు చంద్రునిపై ఉన్న ఖనిజ సమ్మేళనాలపై పరిశోధనలు జరుపుతాయి.

ప్ర: చంద్రయాన్-1 తర్వాత చంద్రయాన్-2 ప్రయోగం చేపట్టడానికి దాదాపు 11 సంవత్సరాల సమయం పట్టింది. ఈ సమయంలో చంద్రయాన్-1 ప్రయోగం నుంచి ఇస్రో నేర్చుకున్న అనుభవాలేంటి?

జ: 2008-09 నుంచే చంద్రయాన్-2 ప్రయోగంపై మా పని ప్రారంభించాము. చంద్రయాన్-2 ప్రయోగంలో ల్యాండర్, రోవర్, ఆర్బిటర్లు ఉంటాయి. ఇది చంద్రుని కోణంలో జరిపే ప్రయోగం. ఇదే తరహాలో రష్యా, చైనాలు కూడా ప్రయోగం చేపట్టాయి. కానీ చంద్రుని మీదకు కాకుండా అంగారక గ్రహం మీదకు చైనా తన ప్రయోగం చేపట్టింది. ఆర్బిటర్, రోవర్, ల్యాండర్లను ఉపయోగించి ప్రయోగం చేసింది. దురదృష్టవశాత్తు 2010-11 మధ్య చేసిన ఈ ప్రయోగం విఫలమైంది. అయినప్పటికీ మేము ఈ ఆర్బిటర్ తయారీని ప్రారంభించాము.

చంద్రయాన్-2 కోసం తయారు చేసిన హార్డ్​వేర్లో స్వల్వ మర్పులు చేసి అంగారకుడి మీదకు చేరుకోవడానికి ఉపయోగించాము. అంగారకుడి దగ్గరకు చేరుకోవాలంటే రెండున్నరేళ్లకు ఒకసారే అవకాశం వస్తుంది. 2013లో వచ్చిన అవకాశాన్ని ఉపయోగించి చంద్రయాన్-2 కోసం తయారు చేసిన ఆర్బిటర్​ను అంగారకుడి వద్దకు పంపించాము. తొలి ప్రయత్నంలోనే అంగారకుడిని చేరుకొని చరిత్ర సృష్టించాము. ఆ తర్వాత బడ్జెట్​తో పాటు షెడ్యూల్​ విషయంలో చంద్రయాన్-2 ప్రయోగంలో భారీ మార్పులు చేశాం. 2015లో చంద్రయాన్-2 ప్రయోగానికి కావలసిన బడ్జెట్​కు ఆమోదం లభించింది. ప్రాజెక్టుకు అవసరమయ్యే 948 కోట్ల బడ్జెట్ విడుదలైంది. ఆర్బిటర్లో ఎలాంటి మార్పులు చేయలేదు. కానీ ల్యాండర్, రోవర్లలో స్వల్ప మార్పులు చేశాం.

చంద్రయాన్-1, మంగళయాన్ ప్రయోగాలు చేసిన అనుభవం చాలా వరకు ఉపయోగపడింది. చంద్రుని మీదకు వెళ్లే స్పేస్ క్రాఫ్ట్ అంగారకుడి మీదకు పంపడం వల్ల హార్డ్​వేర్లలో మార్పులు చేసే విషయంలో పాఠాలు నేర్పింది. అంతేగాక తక్కువ బడ్జెట్లో సమర్థవంతమైన ప్రయోగం కుదిరింది.

ప్ర: చంద్రయాన్-2 జూలై 22న ప్రయోగించారు. సెప్టెంబరు 7న ఇది ల్యాండ్ అవుతుంది. ఈ ప్రయాణం ఎలా సాగుతోంది. దీని ప్రాముఖ్యతను వివరించండి.

జ: చంద్రయాన్-1 ప్రయోగం చాలా సాధారణంగా ప్రారంభించాము. కానీ తర్వాత చాలా పరికరాలను ప్రవేశపెట్టాము. మూన్ ల్యాండింగ్ ప్రోబ్​తో పాటు డజనుకు పైగా పరికరాలను అమర్చాము. దీంతో ఈ ప్రయోగం పీఎస్ఎల్వీ సామర్థ్యానికి మించిపోయింది. దాదాపు 600 కిలోలను చంద్రుని మీదకు చేర్చాల్సి ఉంటుంది. పీఎస్ఎల్వీ వాహకనౌక భూమికి 24 వేల కిలోమీటర్ల దూరం మాత్రమే చేర్చగలుగుతుంది. ఉపగ్రహ ప్రొపెలెన్ సిస్టమ్ ద్వారా కొద్దికొద్దిగా కక్ష్యను పెంచుతాము. సాధారణంగా చంద్రుని వద్దకు చేరుకోవడానికి ఐదు రోజుల సమయం పడుతుంది. దానికోసం భారీ వాహకనౌకలు అవసరమవుతాయి. కానీ మన వద్ద భారీ వాహకనౌకలు లేవు. కొద్దికొద్దిగా కక్ష్యను పెంచడం ద్వారా సాధారణ పీఎస్ఎల్వీ ద్వారా కూడా ప్రయోగాన్ని విజయవంతం చేయగలిగాము. మంగళయాన్​ విషయంలో కూడా ఇదే జరిగింది. వరుస విజయాల వల్ల సాధ్యమైనంత దూరం వరకు వాహకనౌక ఉపయోగించి అక్కడినుంచి కక్ష్యను పెంచుతూ చేసే ప్రయోగం పట్ల నమ్మకం పెరిగింది.

చంద్రయాన్-2 ప్రయోగంలో కూడా సరిగ్గా ఇదే జరిగింది. ఈ ప్రయోగంలో మొదట అనుకున్న తేదీలో కూడా ప్రయోగాన్ని చేపట్టలేకపోయాం. వారం తర్వాత చేపట్టాము. వారం తర్వాత ప్రయోగించినా గానీ సరైన సమయంలో చంద్రుని మీదకు చేరుకుంటున్నాము. ఎక్కువ దశలు ఉండటం, ఈ సమయంలో ఉపగ్రహంలో సెన్సార్లు, అన్ని విషయాలు సరిగ్గా ఉన్నాయో లేదో అని చూసుకునే అవకాశం లభిస్తుంది. ఒకవేళ ఏదైనా అనుకోకుండా జరిగినా సరే ముందుగా నిర్దేశించుకున్న రోజునే ప్రయోగం పూర్తి చేసే అవకాశం ఉంటుంది. చంద్రయాన్-2 ప్రయోగం ప్రారంభించే సమయంలో తలెత్తిన సమస్యలే, చంద్రయాన్-1, మంగళయాన్ ప్రయోగాలలో కూడా తలెత్తాయి. అయినప్పటికీ పునఃప్రణాళిక ద్వారా ఇతర దశలలో మార్పులు చేసుకొని తుది దశను సరైన సమయంలో చేరుకోవచ్చు. భారతీయ ఇంజనీరింగ్ పరిజ్ఞానంతో తయారు చేసిన డిజైన్ వరుసగా మూడు ప్రయోగాలలో విజయం సాధించింది.

ప్ర. ఇప్పటివరకు చంద్రయాన్-2 కొన్ని చిత్రాలు పంపించింది. దాని గురించి ఏమంటారు?

జ: దారిలో తీసిన ఫోటోలు ల్యాండర్లలో నిక్షిప్తం అవుతాయి. ఫొటోలు తీసి వెళ్లే దారితో పోల్చుకుంటుంది. ఒకవేళ వెళ్లే దారికి సరిపోలకపోతే దారిని మార్చుకొని సరైన ప్రాంతంలో దిగుతుంది. ల్యాండర్ సరైన ప్రాంతంలో దిగడానికి ఈ పరికరం ఉపయోగపడుతుంది.

ప్ర. చంద్రయాన్-2 ప్రయోగం తర్వాత ఇస్రో ఎలాంటి ప్రయోగాలు చేయబోతోంది.?

జ: ఇస్రో స్థాపించినప్పటి నుంచి సామాజిక అవసరాలను తీర్చడంపైనే దృష్టి పెట్టింది. అంతరిక్షాన్ని సమాజం కోసం ఏవిధంగా ఉపయోగించాలి అని ఆలోచిస్తుంది. ఇప్పుడు కూడా ఇదే కోణంలో పెద్ద ఎత్తున జరుగుతుంది. రిమోట్ సెన్సింగ్, సమాచార మార్పిడి, నేవిగేషన్, వాతావరణ పరిస్థితులు... భారతదేశంలో వాతావరణాన్ని అంచనా వేయడం రక్షణ విషయంలో చాలా ముఖ్యమైన అంశం. తర్వాత చేపట్టే యాత్ర మానవ రహిత యాత్రే కానీ చంద్రునిపై నుంచి తిరిగి భూమి మీదకు రావడంపై ప్రయోగాలు చేసే అవకాశం ఉంది. అదే విధంగా సూర్యునిపై ప్రయోగాలు చేయడానికి ఉద్దేశించిన ఆదిత్య మిషన్​ను ప్రయోగించే ఆలోచనలో ఉన్నాం. చాలా ప్రయోగాలు ఉన్నాయి. మంగళయాన్-2 ప్రయోగించే ఆలోచనలో ఉన్నాం. ఆర్బిటర్ లేదా చంద్రయాన్-2 మాదిరిగా రోవర్లను పంపే అవకాశాలు ఉన్నాయి.

Last Updated : Sep 29, 2019, 1:27 PM IST

ABOUT THE AUTHOR

...view details