తెలంగాణ

telangana

ETV Bharat / bharat

స్వామీ.. కొవిడ్‌ పరీక్ష తప్పదు సుమీ

శబరిమల దర్శనానికి వచ్చే భక్తులకు నిబంధనలను కఠినతరం చేసింది కేరళ ప్రభుత్వం. శబరిమల చేరే 24గంటల లోపు కొవిడ్ నిర్ధరణ పరీక్ష చేయించుకోవాలని, నెగెటివ్​ అని తేలితేనే ఆలయంలోకి రావాలని సూచించింది. కరోనా ధ్రువపత్రం లేకుంటే రూ.625 రుసుముతో నిర్ధరణ పరీక్ష అక్కడే చేయించి.. నెగెటివ్‌గా తేలితేనే అధికారులు అనుమతిస్తున్నారు.

strict rules in sabarimala temple ahead of covid-19
స్వామీ.. కొవిడ్‌ పరీక్ష తప్పదు సుమీ

By

Published : Dec 7, 2020, 1:15 PM IST

Updated : Dec 7, 2020, 1:31 PM IST

శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులు ఈసారి పూర్తి భిన్నమైన పరిస్థితుల్లో మసలుకోవాల్సి వస్తోంది. కొవిడ్‌ కారణంగా పలు నిబంధనలు అమలులోకి వచ్చాయి. నవంబరు 16 నుంచి డిసెంబరు 27 వరకు మండల మహోత్సవం, డిసెంబరు 30 నుంచి జనవరి 20 వరకు మకర విళక్కు మహోత్సవం సందర్భంగా అయ్యప్ప దర్శనానికి స్వాములు వెళ్తున్నారు. సాధారణంగా ఈ సీజన్‌లో భక్తుల సంఖ్య కోటి వరకు ఉంటుందని అంచనా. ప్రస్తుతం కొవిడ్‌ నేపథ్యంలో రోజుకు 2,000 మంది, శని, ఆదివారాల్లో 3,000 మందికి మాత్రం అవకాశం కల్పిస్తూ ట్రావెన్‌కోర్‌ దేవస్థానం, కేరళ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటికే స్లాట్‌లు బుక్‌ కాగా, ఖాళీ అవుతున్న వాటిని రాత్రిళ్లు రిలీజ్‌ చేస్తున్నారు. కాబట్టి వెళ్లాలనుకుంటున్న భక్తులు మొబైల్‌లో అయినా పరిశీలించుకుంటూ ఉండాలి. ఇరుముడి వేసుకుంటే, ఏదోవిధంగా అనుమతిస్తారనే భావనతో వెళ్తున్న భక్తులను పోలీసులు వెనక్కి పంపేస్తున్నారు.

రోడ్డు, రైలు, విమాన మార్గాల్లో వెళ్లేవారు ఎవరైనా..

శబరిమల చేరే 24 గంటలలోపు కొవిడ్‌ నిర్ధరణ పరీక్ష చేయించుకుని, లేదని తేలినవారు మాత్రమే బయలుదేరి రావాలని కేరళ ప్రభుత్వం కోరింది. రోడ్డుమార్గాల్లో వెళ్లేవారిని ఆ రాష్ట్ర సరిహద్దుల్లో.. ఇంకా రైల్వేస్టేషన్‌లో, విమానాశ్రయాల్లో నిలిపి ధ్రువీకరణ పత్రాలు పరిశీలిస్తున్నారు. శబరిమల ఆన్‌లైన్‌ డాట్‌ ఆర్గ్‌ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకున్న వర్చువల్‌ క్యూ ధ్రువీకరణ పత్రం, ఆధార్‌, కొవిడ్‌ పరీక్ష ఫలితం, ఫోన్‌ నంబరు నమోదు చేసుకుని వదులుతున్నారు. కరోనా ధ్రువపత్రం లేకుంటే రూ.625 రుసుముతో నిర్ధరణ పరీక్ష అక్కడే చేయించి.. నెగెటివ్‌గా తేలితేనే అనుమతిస్తున్నారు. వేర్వేరు మార్గాల్లో పంబకు చేరే వీలున్నందున, ప్రైవేటు వాహనాలు పార్కింగు చేసే నీలక్కల్‌కు 20 కిలోమీటర్ల ముందు, నీలక్కల్‌ నుంచి పంబకు వెళ్లే బస్టాండు వద్ద, పంబ నుంచి శబరి నడకయాత్ర (చిన్నపాదం) ప్రారంభమయ్యే గణపతి ఆలయం వద్ద కూడా ఈ పరిశీలనలు సాగుతున్నాయి.

దర్శనానికి వచ్చిన భక్తులు

మరో 3 చోట్ల కూడా..

వేర్వేరు మార్గాల్లో పంబకు చేరే వీలున్నందున, ప్రైవేటు వాహనాలు పార్కింగు చేసే నీలక్కల్‌కు 20 కిలోమీటర్ల ముందు, నీలక్కల్‌ నుంచి పంబకు వెళ్లే బస్టాండు వద్ద, పంబ నుంచి శబరి నడకయాత్ర (చిన్నపాదం) ప్రారంభమయ్యే గణపతి ఆలయం వద్ద కూడా ఈ పరిశీలనలు సాగుతున్నాయి. అందువల్లే శబరిమల దర్శనానికి వర్చువల్‌ క్యూలో ఇచ్చిన సమయం (స్లాట్‌)కు 3 గంటల ముందుగానే నీలక్కల్‌ చేరాలని సూచిస్తున్నారు. ఒకసారి ధ్రువీకరణ పరిశీలించి, కంప్యూటర్‌లో నమోదు చేసుకుంటున్నందున, తదుపరి ఆ నెంబర్లు స్కాన్‌ చేసి, త్వరగానే వెళ్లేలా చూస్తున్నారు.

దర్శనానికి వస్తున్న భక్తులు

ఇవీ సదుపాయాలు

భక్తులెవ్వరూ పంబా నదిలో దిగి స్నానం చేయకుండా, పక్కనే జల్లు స్నానాలు ఏర్పాటు చేశారు. అక్కడే పెద్ద అన్నదాన సత్రం ఉంది. పంబ నుంచి అయ్యప్ప సన్నిధానానికి మెట్ల మార్గంలో అనుమతించడం లేదు. భక్తులు కిందకు దిగేందుకు వచ్చే మార్గంలోనే వెళ్లాల్సి వస్తోంది. సన్నిధానం పరిసరాల్లో అన్నదానం, మంచినీరు, ఏటీఎంలు, ప్రసాదాల కౌంటర్లు ఉన్నాయి.

శబరిమల అర్చన కౌంటర్​

సామగ్రి ఉంచుకునేందుకు..

నీలక్కల్‌ పార్కింగ్‌ పక్కనే ఉన్న డార్మెటరీలో స్నానం చేసేందుకు, సామగ్రి ఉంచుకునేందుకు ఏర్పాట్లున్నాయి. ఇందుకు రుసుము చెల్లించాల్సి ఉంది. చేతి సంచి ఉన్నా, కొండ ఎక్కడం బరువుగానే ఉంటుంది కనుక, సామగ్రిని ఇలాంటి గదుల్లో ఉంచుకోవడమే మంచిది. నగదు, ఇతర విలువైన వాచీ, సెల్‌ఫోన్ల వంటివి జేబుల్లోనే భద్రపరచుకోవాలి. పంబ నుంచి సన్నిధానానికి తీసుకెళ్లి, తీసుకువచ్చేందుకు డోలీలున్నాయి. గిరాకీకి అనుగుణంగా రూ.4,000-5000 వసూలు చేస్తున్నారు. కార్యాలయంలో నమోదు చేయించుకుంటే ఇంకా తక్కువ మొత్తమే సరిపోతుంది. సన్నిధానానికి సామగ్రి తీసుకెళ్లే ట్రాక్టర్లలోనూ కొందరు వెళ్లి, వస్తున్నారు.

పంబలో స్నానం చేయాలంటే..

అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులు పంబలో స్నానాన్ని తప్పనిసరిగా భావిస్తారు. అయితే పంబ వద్ద ఆ అవకాశం లేదు. ప్రైవేటు వాహనాల్లో నీలక్కల్‌ వరకు వెళ్లే వారిలో కొందరు మాత్రం, దారిలో పంబానది ఉన్నచోట, స్నానం చేస్తున్నారు. అయితే ఇందుకు బాగా కిందకు దిగాల్సి వస్తుంది. ఈ విషయంలో జాగ్రత్త వహించాలని గురుస్వాములు సూచిస్తున్నారు.

ఇదీ చదవండి :'శబరిమల దర్శనానికి భక్తుల సంఖ్య పెంపు'

ఇదీ చదవండి :శబరిమల యాత్రకు నూతన మార్గదర్శకాలివే!

Last Updated : Dec 7, 2020, 1:31 PM IST

ABOUT THE AUTHOR

...view details