భర్త మోసం చేసి మరో మహిళతో పరారయ్యాడని ఝార్ఖండ్ రాంచీలోని సదర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది ఓ మహిళ. వివరాలు తెలుసుకున్న పోలీసులు షాక్కు గురయ్యారు. భర్తను చెరో మూడు రోజులు పంచుకునేలా తమ మధ్య ఒప్పందం కుదిరిందని.. కానీ ఇప్పుడు తాను మోసపోయానని మొదటి భార్య చెప్పగానే ఏం చేయాలో తెలియక పోలీసులు తలలు పట్టుకున్నారు.
ఒప్పందం ప్రకారం...
రాంచీలోని దర్వుసల్కు చెందిన రమేశ్ కుమార్ మహతోకు గతంలోనే పెళ్లి అయింది. అయినా మరో మహిళతో ప్రేమలో పడ్డాడు. మొదటి భార్యకు తెలియకుండా గతనెల 31న రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న మొదటి భార్య... భర్తపై కేసు పెట్టింది. రెండో భార్య తరఫు బంధువులు కూడా రమేశ్.. తమ అమ్మాయిని కిడ్నాప్ చేశాడని కేసు పెట్టారు.
దిక్కు తోచని స్థితిలో.. మొదటి భార్యను ఆశ్రయించాడు రమేశ్. ఎలాగైనా తనను కేసుల నుంచి బయటకు తీసుకురావాలని ప్రాధేయపడ్డాడు. అందుకు కనికరించిన ఆమె అతడితో ఓ ఒప్పందం కుదుర్చుకుని పోలీసుల నుంచి విడిపించింది.
చెరో మూడు రోజులు
రెండో పెళ్లి చేసుకున్న భర్తను పెద్ద మనసుతో క్షమించింది మొదటి భార్య. వారంలో.. తన వద్ద మూడు రోజులు, మరో మూడు రోజులు రెండో భార్య వద్ద ఉండేలా అధికారిక ఒప్పందం కుదుర్చుకుంది. మిగిలిన ఒక్కరోజు రమేశ్ ఎవరితోనూ ఉండడు.