'మహా'పై కరోనా పంజా- 22వేలకు చేరువలో మరణాలు - కరోనా వ్యాప్తి
దేశంలో కొవిడ్ మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న వైరస్ బాధితుల సంఖ్య తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. మహారాష్ట్రలో తాజాగా 14,492 మందికి కరోనా నిర్ధరణ అయింది. మరో 297మంది ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటకలో తాజాగా 7,330 కేసులు వెలుగుచూశాయి. అటు ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ వైరస్ ఉద్ధృతి తీవ్రంగా ఉంది.
మహాపై కోరలు చాచిన కరోనా.. 22వేలకు చేరువలో మరణాలు
By
Published : Aug 22, 2020, 7:56 PM IST
|
Updated : Aug 22, 2020, 8:29 PM IST
కొన్ని నెలలుగా దేశ ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురిచేస్తోంది కరోనా వైరస్. ఆందోళనకర స్థాయిలో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా మహారాష్ట్రలో 14,492 మందికి వైరస్ సోకింది. ఫలితంగా ఆ రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 6,61,942కు చేరింది. మహమ్మారి ధాటికి మరో 297మంది మృతిచెందగా.. మరణాల సంఖ్య 21,995కు పెరిగింది.
ఇప్పటివరకు మహారాష్ట్రలో 4,80,114 మంది వైరస్‌ను జయించి డిశ్చార్జి అయ్యారు. 1,69,516 మంది వివిధ ఆస్పత్రులలో ఇంకా చికిత్స పొందుతున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
ఇతర రాష్ట్రాల పరిస్థితి ఇలా...
కర్ణాటకలో కొత్తగా 7వేల 330మంది కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణకాగా.. మొత్తం కేసుల సంఖ్య 2,71,876కు పెరిగింది. వైరస్ కారణంగా మరో 93 మంది చనిపోగా, ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 4,615కు చేరింది.
తమిళనాడులో 5వేల 980మందికి వైరస్ సోకింది. మొత్తం కేసులు 3లక్షల 73వేల 410కి చేరాయి. మరో 80 మరణాలతో మొత్తం మృతుల సంఖ్య 6,420కు పెరిగింది.
దిల్లీలో కొత్తగా 1,412 కేసులు, 14 మరణాలు నమోదయ్యాయి. ఇప్పటివరకు దేశ రాజధానిలో లక్షా 60వేల 16మంది కరోనా బారినపడ్డారు. మరో 4వేల 284మంది కొవిడ్‌కు బలయ్యారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లో తాజాగా 5,375 కరోనా కేసులు వెలుగుచూడగా.. మొత్తం బాధితుల సంఖ్య 1,82,614కు చేరింది. మరో 70 మరణాలతో, ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 2,867కు చేరింది.
కేరళలో శనివారం.. 2 వేల 172 కరోనా కేసులు బయటపడ్డాయి. మొత్తం బాధితుల సంఖ్య 56,354కు పెరిగింది.