పాకిస్థాన్ తన దుర్బుద్ధిని మరోసాసారి చాటుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సార్క్ దేశాధినేతల వీడియో కాన్ఫరెన్స్‌లో కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించి తన అక్కసును వెళ్లగక్కింది. కొవిడ్ వైరస్‌పై పోరాటానికి ఏర్పాటు చేసిన సమావేశ ఉద్దేశాన్ని బేఖాతరు చేస్తూ కశ్మీర్ నిర్బంధంపై వక్ర భాష్యం పలికింది.
ఈ సమావేశానికి పాక్ తరఫున ఆ దేశ ఆరోగ్య మంత్రి జాఫర్ మిర్జా హాజరయ్యారు. జమ్ముకశ్మీర్‌లోనూ కొవిడ్ కేసులు నమోదయ్యాయంటూ అనవసర విషయాలు ప్రస్తావించారు. ఆరోగ్య అత్యవసర పరిస్థితి నేపథ్యంలో కశ్మీర్‌లోని నిర్బంధాన్ని ఎత్తివేయాలని చెప్పుకొచ్చారు.
"కరోనా నేపథ్యంలో సార్క్ సభ్య దేశాలన్నీ... అన్ని ప్రాంతాల ప్రజలకు అత్యవసర సహాయం అందిస్తాయని ఆశిస్తున్నాం. జమ్ముకశ్మీర్‌లోనూ కొవిడ్-19 గుర్తించడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుత ఆరోగ్య అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో వివాదాస్పద ప్రాంతంలో నిర్బంధాన్ని ఎత్తివేసి మందులు సరఫరా చేయడం, రవాణ సౌకర్యం కల్పించడం చాలా ముఖ్యం."-జాఫర్ మిర్జా, పాకిస్థాన్ ఆరోగ్య మంత్రి