జలియన్‌వాలా అమరులకు నివాళులర్పించిన రాహుల్ జలియన్‌వాలాబాగ్ ఊచకోత ఘటన జరిగి నేటికి శతాబ్దం గడిచింది. ఈ సందర్భంగా అమరులకు నివాళులర్పించారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. అమృత్‌సర్‌లోని జలియన్‌వాలాబాగ్ స్మారక స్థూపానికి పుష్పాంజలి ఘటించారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు.
"స్వాతంత్ర్య సాధన కోసం జీవితాలను పణంగా పెట్టిన గొప్ప వ్యక్తుల త్యాగాలను దేశం ఎప్పటికీ మరువదు." అని సందర్శకుల పుస్తకంలో రాశారు రాహుల్.
బ్రిటిష్ హై కమిషనర్ నివాళి
బ్రిటిష్ హై కమిషనర్ డొమినిక్ అస్కిత్ జలియన్ వాలా బాగ్ మృతులకు స్మారక స్థూపం వద్ద నివాళులర్పించారు.
"100 ఏళ్ల క్రితం నాటి జలియన్ వాలా బాగ్ ఘటన భారత్‌లో బ్రిటిష్ పాలనకు మాయని మచ్చ. అప్పుడు జరిగిన ఘటనకు మేం విచారం వ్యక్తం చేస్తున్నాం. ప్రస్తుతం లండన్, భారత్ పరస్పర సహకారంతో అభివృద్ధి దిశలో ముందుకు సాగుతున్నందుకు సంతోషంగా ఉంది.' అని సందర్శకుల పుస్తకంలో రాశారు అస్కిత్.
1919, ఏప్రిల్ 13న అమృతసర్‌లోని జలియన్ వాలాబాగ్‌లో నిరాయుధులైన స్వాతంత్య్రోద్యమకారులపై బ్రిటిష్ దళాలు విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాయి. తూటాల గాయాలతో పాటు, తొక్కిసలాటలో అనేక మంది భారతీయులు మృతి చెందారు.
ఇదీ చూడండి:'జలియన్ వాలాబాగ్' మారణకాండకు వందేళ్లు